డీఎస్సీ నియామకాల షెడ్యూల్ విడుదల | Sakshi
Sakshi News home page

డీఎస్సీ నియామకాల షెడ్యూల్ విడుదల

Published Mon, Feb 1 2016 4:53 AM

డీఎస్సీ నియామకాల షెడ్యూల్ విడుదల - Sakshi

* నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం
* మార్చి 5న అభ్యర్థులకు నియామక పత్రాలు
* వారంలో స్కూల్ అసిస్టెంట్ల షెడ్యూల్
* మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 1న వెబ్‌సైట్‌లో ఉంచడంతో మొదలయ్యే ప్రక్రియ మార్చి 5న జరిగే నియామకాలతో ముగుస్తుందని తెలిపారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.

మెరిట్ లిస్ట్‌ను ఫిబ్రవరి 1న వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఎంపికైన అభ్యర్థుల పేర్లను ఫిబ్రవరి 5న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా సిద్ధం చేస్తామన్నారు. 8న ఈ అభ్యర్థుల జాబితాను జిల్లా ఎంపిక కమిటీ ఖరారు చేస్తుందని తెలిపారు. 9 నుంచి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన, అప్‌లోడ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 17న అనర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 22న మరోసారి ప్రదర్శిస్తామని చెప్పారు. ఖాళీల జాబితాను 24న డీఈవోలు అందజేస్తారని, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన 25న ఉంటుందని పేర్కొన్నారు.

అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 29న ప్రకటిస్తామని వివరించారు. మార్చి 1వ తేదీన వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 5న ఆయా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఇన్నాళ్లూ డీఎస్సీ కోర్టు వివాదాల్లో ఉండడంతోనియామకాల్లో జాప్యం జరిగిందన్నారు. ఈ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8,086 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల భర్తీపై కోర్టులు తీర్పులను రిజర్వ్‌లో ఉంచాయన్నారు. అవి కూడా వారం రోజుల్లో పరిష్కారమవుతాయని, ఆ వెనువెంటనే స్కూల్ అసిస్టెంట్ల నియామక షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు.
 
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు  పునరుద్ఘాటించారు.  కాగా ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా రాజకీయ గర్జన అని మంత్రి గంటా పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement