చరిత్రను దాచలేం.. | Sakshi
Sakshi News home page

చరిత్రను దాచలేం..

Published Mon, Sep 12 2016 12:13 AM

చరిత్రను దాచలేం..

  • సెప్టెంబర్‌ 17ను రాజకీయ కోణంలో చూడొద్దు 
  • నాటి వీరోచిత పోరాట గాథలు భావి తరాలకు తెలియాలి 
  • కేసీఆర్‌ కూడా ఉమ్మడి పాలకుల వైఖరినే అనుసరిస్తున్నారు
  • కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
  •  
    హన్మకొండ:
     
    సెప్టెంబర్‌ 17ను రాజకీయ కోణంలో చూడొద్దని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చరిత్రను కాదనలేము.. దాచలేమని అన్నారు. నాటి వీరోచిత పోరాటాలు, గాథలు భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిజాం పాలనలో జరిగిన ఘోరాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా కుల, మత, భాష, సాంప్రదాయాలకు అతీతంగా ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొమురం భీం, వందేమాతరం రాంచందర్‌రావు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్‌ వంటి ఎందరో అశువులు బాశారని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారని తెలిపారు. ఆ రోజున టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగుర వేస్తున్న నాయకులు.. అధికారికంగా చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల్లాగే ప్రస్తుత సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని,  ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను, చరిత్రను గౌరవించాలని సూచించారు. నిజాంపై సైనిక చర్యను వ్యతిరేకించి కమ్యూనిస్టులు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని దత్తాత్రేయ ఆరోపించారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా అధికారికంగా నిర్వహించాలని కోరితే కొందరు నాయకులు దీనికి మతం రంగు పులుముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర తెలంగాణలో ఈ నెల 17న ముగుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా హన్మకొండలో జరిగే ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అమిత్‌షా పర్యటన పై రూపొందించిన పాటల క్యాసెట్, పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు.  పాటల సీడీని రూపొందించిన నాగపురి రాజమౌళిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు చింతాకుల సునీల్, నాయకులు డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, రావు పద్మ, డాక్టర్‌ విజయలక్ష్మి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, ఒంటేరు జయపాల్, నాగపురి రాజమౌళి, వంగాల సమ్మిరెడ్డి, బన్న ప్రభాకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్, లక్ష్మణ్‌నాయక్, గుజ్జ సత్యనారాయణ రావు, సురేష్, రఘునారెడ్డి పాల్గొన్నారు.
     
    బహిరంగ సభ ప్రచార రథాలు ప్రారంభం
    బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొననున్న బహిరంగ సభ విజయవంతానికి ఆ పార్టీ అనేక రూపాల్లో ముందుకు పోతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్, పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రులు సాద్వి నిరంజన్, బండారు దత్తాత్రేయ డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన తిరంగయాత్ర సభల్లో పాల్గొన్నారు. అమిత్‌ షా పాల్గొననున్న బహిరంగ సభపై విస్తృత ప్రచారం చేయడానికి రూపొందించిన 14 ప్రచార రథాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో దత్తాత్రేయ ప్రారంభించారు. అంతకు ముందు ఇదే స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభ వేదికకూ భూమి పూజ చేసి చేశారు.   

Advertisement
Advertisement