సమస్యలు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Published Mon, Apr 10 2017 4:22 PM

సమస్యలు పరిష్కరించాలి

–ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఉపాధి కూలీలు

టెక్కలి: ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేతనదారులు సోమవారం టెక్కలి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.ఎల్లయ్య మాట్లాడుతూ ఉపాధి వేతనదారులకు బకాయి వేతనాలు చెల్లించాలని, ప్రతీ కుటుంబానికి 150 రోజులు పని కల్పించాలని, ప్రభుత్వం ప్రకటించిన 307 రూపాయల దినసరి కూలీ అమలు చేయాలని, 50 రోజులు పని పూర్తి చేసిన వేతనదారులకు భీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే ఉపాధి నిధులతో సిమెంట్‌ రోడ్లు, యంత్రాలతో పనులు తక్షణమే నిలిపివేయాలని, వేసవి కాలం అలవెన్స్‌ పెంచాలని, మేజరు పంచాయతీలో శాశ్వత ఫీల్డు అసిస్టెంట్‌ను నియమించాలని ఎల్లయ్య డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీఓ వై.రవీంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ నాయకుడు ఎన్‌.షణ్ముఖరావు, ఉపాధి వేతనదారులు కె.పార్వతి, జి.ఏకాశి, జె.రాజేశ్వరి, డి.నీలవేణి, డి.విజయ, అమల, పార్వతి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement