శిథిలావస్థలో గ్రంథాలయం | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో గ్రంథాలయం

Published Fri, Oct 14 2016 3:26 AM

darmaram Library in Damge condition

ధర్మారం(పెద్దపల్లి జిల్లా): ప్రజలకు విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయం పాలకుల నిర్లక్ష్యంతో  శిథిలావస్థకు చేరుకుంది.  మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవటంతో పాఠకులకు సరైన రీతిలో సేవలందించలేకపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడాల్సిన విలువైన పుస్తకాలు వానకు తడుస్తూ చెదలు పడుతున్న దుస్థితి నెలకొంది.   ధర్మారం మండల కేంద్రంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినప్పటికి ఫలితం లేదని పాఠకులు ఆరోపిస్తున్నారు.

ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరి æ పైకప్పు నుంచి వర్షపు నీరు వస్తోంది.   స్థానిక లైబ్రెరియన్‌ పై కప్పు పెంకుల మీద ప్లాస్టిక్‌ కవర్లు కప్పించారు. అయినా వర్షం పడుతున్నప్పుడు ఉరుస్తోంది. దీంతో విలువైన గ్రంథాలు, దిన, వారపత్రికలు నీటిలో తడుస్తున్నాయి. ఇరుకు గదుల్లో గ్రంథాలయం ఉండటంతో విలువైన పుస్తకాలను భద్రపర్చటానికి స్థలం లేక పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి.  పురాతన కాలంనాటి  విషయాలను  భవిష్యత్‌  తరాలకు అందించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నా శిథిలావస్థకు చేరిన భవనంతో ఫలితం లేకుండా పోతోందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయం గ్రామం చివరలో ఉండటంతో ఎక్కువ మంది రావడం లేదు.  ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రంథాలయానికి పక్క భవనాన్ని నిర్మించుటకు నిధులు మంజూరు చేయించాలని పాఠకులు కోరుతున్నారు.

భూమి కేటాయించాలి
మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలో ప్రభుత్వం భూమిని గ్రంథాలయ భవనం కోసం కేటాయించాలి. ప్రసుత్తం ఉన్న చోట సరైన వసతులు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ భవనాన్ని నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది.
-బత్తిని సంతోష్, బొట్లవనపర్తి

నిధులు మంజూరు చేయాలి
 గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలి. నిరుద్యోగులకు పోటీపరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలి.  సొంత భవనం నిర్మించేలా చూడాలి.
                           - ఎండీ.రఫీ, ధర్మారం
 అందుబాటులో ఉంచాలి
పోటీ పరీక్షలకు  హాజరయ్యే నిరుద్యోగులకు గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచాలి. త్వరలో జరగబోయే  గ్రూప్‌ పరీక్షలకు అవసరమయ్యో పుస్తకాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
                         - మోహన్‌నాయక్,

Advertisement
Advertisement