Sakshi News home page

దసరా కిక్కే వేరప్పా!

Published Thu, Oct 13 2016 11:45 PM

దసరా కిక్కే వేరప్పా! - Sakshi

పన్నెండు రోజులు... రూ.24 కోట్లు
- పండుగ దినాల్లో మందుబాబుల జోరు
- జిల్లాలో భారీగా పెరిగిన అమ్మకాలు
- గత పది నెలల్లో రూ.457.86 కోట్లు తాగేశారు
- ప్రభుత్వానికి రూ.22కోట్ల ఆదాయం
- బెల్టు షాపుల్లో యథేచ్ఛగా విక్రయాలు
 
కర్నూలు: పది నెలల్లో రూ.457.86 కోట్లు. ఈ మొత్తం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన నిధులనుకుంటే పొరపాటు. మందుబాబులు తమ జేబు గుల్ల చేసుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన మొత్తమిది. మద్యంతో పాటు.. ఇతరత్రా స్టఫ్ కలిపితే ఆ మొత్తం రూ.600 కోట్లు దాటి ఉంటుందని ఓ అంచనా. జిల్లాలో 203 మద్యం దుకాణాలు.. 35 బార్లు ఉండగా.. బెల్టు షాపులు 3వేలకు పైమాటే. గొలుసు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్న వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. గుర్తింపు కలిగిన మద్యం దుకాణం నిర్వహణకు ప్రభుత్వ పరంగా నిర్దేశిత సమయం ఉండగా.. బెల్టు దుకాణాలు నిరంతరంగా కొనసాగుతుండటం గమనార్హం.
 
ఏరులై పారుతున్న మద్యం
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నా... ఎందరో అభాగ్యులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నా... చివరకు కుటుంబాలు రోడ్డున పడుతున్నా మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట పడని పరిస్థితి. పట్టణాల్లో మద్యం షాపులు, పల్లెల్లో బెల్టు షాపులు బార్లను తలపిస్తున్నాయి. ఇందుకు ఏటా పెరుగుతున్న అమ్మకాలే నిదర్శనం. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు పది మాసాల్లో రూ.382.27 కోట్ల అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది రూ.457.86 కోట్ల మద్యం విక్రయించారు. గత ఏడాది అక్టోబర్‌లో నెల రోజులకు రూ.22.42 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ అక్టోబర్‌ నెల 12 రోజులకే రూ.24.69 కోట్ల విలువ చేసే మద్యాన్ని మందు బాబులు తాగేశారు. ప్రతి నాలుగు రోడ్డు ప్రమాదాల్లో రెండు మద్యం మత్తు వల్లే జరుగుతున్నాయంటూ సర్వేలు చెబుతున్నా తాగి వాహనాలు నడిపే వారు ఎక్కువయ్యారు. గ్రామాల్లో కూలీ నాలీ చేసుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని బెల్టు దుకాణాదారులు మద్యాన్ని ఏరులై ప్రవహింపజేస్తున్నారు.
 
దసరా పండుగ ‘కిక్కే’ వేరప్పా..
పండగ సంబరమో.. లేక అలవాటు పడ్డ ప్రాణమో తెలియదు కానీ.. దసరా సందర్భంగా మద్యం ప్రియులు పీకల దాకా తాగేశారు. ఎన్నడూ లేని రీతిలో పన్నెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి రూ.22 కోట్ల ఆదాయం సమకూరింది. గాంధీ జయంతి సందర్భంగా 2వ తేదీ సెలవు ప్రకటించగా దసరా పండుగ సందర్భంగా ఐఎంఎల్‌ డిపో కూడా మూడు రోజులు మూత పడింది. దసరా పండుగను పురస్కరించుకుని వ్యాపారులు ముందుగానే పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచి సొమ్ము చేసుకున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1.50 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. దసరా పండుగ సందర్భంగా ప్రతిరోజూ రూ.3 కోట్లకు పైనే మద్యం విక్రయించారు. ఈనెల 4వ తేదీన రూ.3.36 కోట్లు, 5న రూ.2.37 కోట్లు, 6న రూ.2.38 కోట్లు, 7న రూ.3.20 కోట్లు, 8న రూ.3.41 కోట్లు, 10వ తేదీన రూ.5.97 కోట్ల విలువ చేసే మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు.
 
ముక్క కోసం రూ.5 కోట్లు
దసరా పండుగ సందర్భంగా 'మాంసం' విక్రయాలు కూడా జోరుగా జరిగాయి. పండుగ మంగళవారం రావడంతో తర్వాతి రోజు బుధవారం మాంసం ప్రియులు పండుగ 'విందు'ను చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 200 క్వింటాళ్ల మటన్, 25 టన్నుల కోడిమాంసం విక్రయాలు జరిగినట్లు అనధికార అంచనా. సుమారు రూ.5 కోట్లు ముక్క కోసమే వెచ్చించినట్లు తెలుస్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement