రెవెన్యూలో పదోన్నతులు వాయిదా | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో పదోన్నతులు వాయిదా

Published Thu, Jul 28 2016 1:03 AM

Deferred promotions in revenue department

  • ‘సాదాబైనామా’ పరిశీలన ఉన్నందున జేసీ నిర్ణయం
  • హన్మకొండ అర్బన్‌ : సుమారు నెలరోజులుగా ఇదుగో అదిగో... అంటూ ఊరిస్తున్న రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు, జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రియకు బ్రేక్‌ పడింది. దీని ఫలితంగా పదోన్నతులు పొంది పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలింది. ప్రస్తుతం గ్రామస్థాయిలో సాదాబైనామాల ప్రక్రియ కొనసాగుతున్నందున వీఆర్వోల బదిలీ, పదోన్నతులు ఆగస్టు మొదటి వారంలో పరిశీలిద్దామంటూ జేసీ ఆదేశించినట్లు సమాచారం. దీంతో సుమారు 20రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్‌లో పడిగాపులు వస్తూ వచ్చిన వీఆర్వోలు ఉస్సూరుమంటూ వెళ్లారు.
     
    ఆర్‌ఐ పోస్టుల కోసం
    వీఆర్వోలు, జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలుగా పదోన్నతి కల్పించేందుకు కొద్దినెలల క్రితమే పేర్లతో సహా ఫైల్‌ సిద్ధమైంది. ఇంతలో కొందరు వీఆర్వోలు తమకు నగరం చుట్టుపక్కల ఆర్‌ఐ పోస్టింగ్‌లూ కావాలని పట్టుబట్టి ఢిల్లీ స్థాయి నుంచి ఫోన్లు చేయించగా అధికారులు ఆగ్రహించినట్లు సమాచారం. కాగా పదోన్నతి పొందిన వారికి సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టింగ్‌ ఇస్తామని డీఆర్వో ఇప్పటికే చెప్పినా వారు ఆర్‌ఐ పోస్టు... అది కూడా తాము కోరుకున్న చోటే కావాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి రాడంతో అధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
     
    80 పోస్టులు ఖాళీ..
    ప్రస్తుతం జిల్లాలో మొత్తంగా 60కిపైగా సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 20కిపైగా ఏఆర్‌ఐ, ఎంఆర్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. అయితే మండలానికి ఒక ఆర్‌ఐ పోస్టు సరిపోతుందని భావించిన అధికారులు ప్రసుతం సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయాలని భావించారు. ఇదే ఉద్దేశంతో ఇటీవల కొందరు సీనియర్‌ అసిస్టెంట్లను ఆర్‌ఐ పోస్టుల్లోకి బదిలీ చేశారు. ఈక్రమంలో అధికారులపై ఆర్‌ఐ పోస్టుల కోసం ఒత్తిళ్లు పెరగడంతో వారు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
     
    కొన్నిచోట్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆర్‌ఐలను బదిలీ చేసి మరీ తమకు ఆ పోస్టింగ్‌ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లాలోని ఒక మంత్రి, రాష్ట్రం నుంచి ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడే కాకుండా కొందరు ఆర్డీవోల నుంచి పోస్టింగ్‌ల కోసం చెప్పిస్తున్నట్లు సమాచారం. అయితే, మొత్తం ప్రక్రియ వాయిదా పడగా... ఆగస్టు మొదటి వారంలో ఎవరి పంతం నెగ్గుతుందో తేలనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement