అభివృద్ధి అంటే అమరావతేనా...? | Sakshi
Sakshi News home page

అభివృద్ధి అంటే అమరావతేనా...?

Published Sat, Oct 8 2016 4:45 PM

ప్రజా సమస్యలను సావధానంగా వింటున్న ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి

 
– వైఎస్‌ ఉంటే సమస్యలు ఉండేవికాదు
– గడప గడపకూ వైఎస్సార్‌లో ప్రజల ఆవేదన
మదనపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాజధాని అమరావతి తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి దుయ్యబట్టారు. ఆయన శనివారం మదనపల్లె మున్సిపాలిటీలోని ఒకటో వార్డు బీకేపల్లె వైఎస్సార్‌ కాలనీలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ తమ కాలనీలో మౌలిక వసతులు లేవని వాపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో ఇళ్లు నిర్మించి ఇచ్చారని, తాగునీటి సౌకర్యం కల్పించలేదన్నారు. రోడ్లు, వీధి దీపాలు, కాలువలు నిర్మించలేదని తెలిపారు. పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి సీఎం చంద్రబాబు విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే అక్కడ అధికారులు మాత్రమే ఉంటారని, గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది సామాన్య ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. ఊహల్లో కాకుండా వాస్తవాల్లోకి రావాలన్నారు. వైఎస్‌ కాలనీలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ముఖ్యంగా మదనపల్లె నియోజకవర్గంలోని వైఎస్‌ కాలనీలను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట ఒకటో వార్డు ఇన్‌చార్జ్‌ మేస్త్రీ, శ్రీనివాసులు, శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్‌ ఖాన్, అంబేడ్కర్‌ చంద్రశేఖర్, కమాల్‌ బాషా తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement