గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక

Published Sat, Sep 17 2016 11:18 PM

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక

దేవరపల్లి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. దేవరపల్లి కరుటూరి ఫంక్షన్‌lహాలు వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. అన్ని పంచాయతీల్లో ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు మంచినీరు, అంతర్గత రోడ్లు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులతో వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మాణం చేయనున్నట్టు ఆయన వివరించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.646 కోట్లు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఈ నిధులకు 50 శాతం ఉపాధి నిధులు కలిపి గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సర్పంచ్‌లకు సూచించారు. జిల్లాకు రూ. 57.34 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు.
 ప్రతి గ్రామంలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో 365 భవనాల నిర్మాణానికి రూ.25.55 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. పంట సంజీవిని కింద గ్రామంలో 100 నీటికుంటలు తవ్వితే రూ.3 లక్షలు పంచాయతీరాజ్‌ ద్వారా బహుమతిగా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.   
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement