వైద్యం అందకపోవడం వల్లే మృతి | Sakshi
Sakshi News home page

వైద్యం అందకపోవడం వల్లే మృతి

Published Thu, Feb 2 2017 10:49 PM

వైద్యం అందకపోవడం వల్లే మృతి

- బాధిత కుటుంబీకుల ఆరోపణ
- బంధువులు, కులసంఘాల నాయకులతో కలిసి బైఠాయింపు
- 108 వాహనంలోనే మృతదేహం
- డీఎంహెచ్ఓ జోక్యంతో శాంతింపు
బేతంచెర్ల: అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్‌లో వస్తే డాక్టర్లు లేకపోవడంతో ప్రాణాలే పోయాయని బేతంచెర్ల పీహెచ్‌సీ వద్ద మరణించిన ఓ మహిళ కుటుంబీకులు గురువారం అక్కడే ఆందోళన చేపట్టారు. బంధువులు, కుల సంఘాల నేతలతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబీకులు, బంధువుల వివరాల మేరకు.. 11 రోజుల క్రితం మృతి చెందిన  బేతంచెర్ల బేగరి పేటకు చెందిన పోల మాధన్న భార్య చెన్నమ్మ పెద్ద కర్మ నిమిత్తం విద్యుత్‌ ఏఈ పోలా కేశవులు, భార్య లక్ష్మిదేవి బుధవారం వచ్చారు. గురువారం మధ్యాహ్నం లక్ష్మిదేవి బాతురూమ్‌లో జారీ సృహతప్పి పడిపోయింది.
 
 కుటుంబ సభ్యులు 108 వాహనంలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు ఉండకపోగా అంబులెన్స్‌ వైద్య సిబ్బంది సమాచారం ఇచ్చినా రాలేదు. కొద్దిసేపటికే లక్ష్మిదేవి మరణించింది. అయితే సకాలంలో వైద్యం అందించి ఉంటే లక్ష్మిదేవి బతికి ఉ ండేదంటూ  బంధువులు, కుల సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సీఐ కంబగిరి రాముడు, ఎస్‌ఐ తిరుపాలు నచ్చజెప్పినా వినకుండా మృతదేహాన్ని 4 గంటల పాటు 108 వాహనంలో ఉంచి రోడ్డుపై బైఠాయించారు. సీఐ ద్వారా విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ.. శుక్రవారం బేతంచెర్లకు వచ్చి విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇవ్వడంతో శాంతించారు. 
 
విచారణకు మంత్రి ఆదేశం..
బేతంచెర్ల పీహెచ్‌సీ వద్ద జరిగిన ఘటన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ దృష్టికి   వెల్లడంతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డీఎంహెచ్‌ఓను  ఆదేశించారు.    
 

Advertisement
Advertisement