చంద్రన్నబాట... తేలని వాటా! | Sakshi
Sakshi News home page

చంద్రన్నబాట... తేలని వాటా!

Published Mon, Aug 8 2016 8:46 PM

:పూసపాటి రేగ మండలం కుమిలిలోని సీసీ రహదారి

ఉపాధి నిధులపై తేలని నిర్ణయం
నిర్మాణాలకు ముందుకు రాని పంచాయతీలు
యాభైశాతం భరించలేమని పాలకవర్గాల వాదన
ముందుకు సాగని పనులు
 
 
విజయనగరం కంటోన్మెంట్‌:  పల్లెల్లో సీసీరోడ్లకు కొత్త చిక్కొచ్చిపడింది. గత ఏడాది శతశాతం ఉపాధి హామీ నిధులతో చేపట్టిన ఈ పనులకు ఈ సారి యాభైశాతం పంచాయతీలే భరించాలనడంతో పాలకవర్గాలు వెనకడుగు వేస్తున్నాయి. అంత మొత్తం వెచ్చించగల సామర్ధ్యం తమకు లేదని తెలిసినా... సర్కారు నిర్ణయంపై మండిపడుతున్నాయి. గత ఏడాది చంద్రన్నబాట పేరుతో రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిన జిల్లా... ఈ సారి చివరిస్థానానికి చేరుకోగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపాధి నిధులు దండిగా వచ్చాక... ప్రతి పల్లెలో సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. నాణ్యత లేకున్నా... ఫిర్యాదులు ఎన్ని వచ్చినా... పనులు ఆగలేదు. వాటికి బిల్లులూ  నిలుపుదల చేయలేదు. కానీ ఈ ఏడాది ఆ ఊపు... ఆ ఉత్సాహం కనిపించడం లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలే. గత ఏడాది శతశాతం ఉపాధి హామీ నిధులతోనే పనులు చేపట్టగా... ఈ సారి యాభైశాతం పంచాయతీలే భరించాలనడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. పంచాయితీల ఆదాయమే అంతంత మాత్రంగా ఉంటే 50 శాతం నిధులు తామెలా చెల్లిస్తామని ఆయా సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధమ స్థానం పొందిన చంద్రన్న బాట ఇప్పుడు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది.
 
 
తొలుత ఉత్సాహంగా...
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఉపాధి నిధులు వినియోగించుకోవాలని ప్రారంభంలో నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. నాణ్యతను పక్కన పెడితే అన్ని గ్రామాల్లోనూ ఏకబిగిన నిర్మాణాలు సాగాయి. శతశాతం ఉపాధి నిధులు అనగానే సర్పంచ్‌లు జాతరలా ముందుకు వచ్చారు. ఈ దశలో వారికి ఆర్థికంగానూ ఎంతో కొంత ప్రయోజనం కలిగింది. పెట్టుబడి పెట్టుకునే సర్పంచ్‌లతో పాటు పెట్టుబడి పెట్టలేనివారు కమీషన్‌కు అమ్ముకోవడంతో జిల్లాలో 77.88 కిలోమీటర్ల మేరకు నిర్మాణాలు జరిగాయి. దీనికి తోడు అధికారుల పర్యవేక్షణకు సిబ్బందికొరత వారికి కలసివచ్చింది.lకొన్ని చోట్ల అవసరం లేని చోట్ల కూడా రోడ్లు నిర్మించేశారు. ఇప్పుడీ 50 శాతం బిల్లుల సంగతి తెరమీదకు రావడంతో అందరికీ అయోమయంగా తయారైంది. 
 
 
మారని సాఫ్ట్‌వేర్‌!
చంద్రన్న బాట సీసీ రహదారుల నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన బిల్లుల ప్రక్రియకు అవసరమయిన సాఫ్ట్‌వేర్‌ మాత్రం ఇంకా మారలేదని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్నట్టు వంద శాతం నుంచి 50 శాతం ఉపాధి నిధుల వినియోగమయితే సాఫ్ట్‌వేర్‌లోనూ కొద్దిగా మార్పులు చేర్పులు ఉండేవని, కానీ ఇంకా సాఫ్ట్‌వేర్‌ కూడా మారలేదని అంటున్నారు. అయినా ఎవరూ ముందుకు రావడంలేదు. 
 
 
సీసీ రోడ్లు నిర్మించాలని చెబుతున్నాం: కె.వేణుగోపాల్, పర్యవే„ý క ఇంజనీరు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం, విజయనగరం 
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని చెబుతున్నాం. కానీ చాలా మంది ముందుకు రావడం లేదు. 50 శాతమే బిల్లులు వస్తాయేమోనని భయపడుతున్నారు. ఆదాయం తక్కువుండే పంచాయితీలు 50 శాతం చెల్లించడం అసాధ్యం. అందుకనే వెనుకంజ వేస్తున్నారు. 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement