ఎవరి వాదన వారిదే | Sakshi
Sakshi News home page

ఎవరి వాదన వారిదే

Published Mon, Aug 15 2016 12:52 AM

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులతో జిల్లా పునర్విభజన మంత్రివర్గ ఉపసంఘం

-జిల్లాల పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు 
– గద్వాల జిల్లాపై పట్టుబట్టిన డీకే అరుణ
– నారాయణపేట జిల్లా కావాలన్న రాజేందర్‌రెడ్డి
– షాద్‌నగర్‌ను చేయాలన్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డి
– కల్వకుర్తే ప్రత్యామ్నాయమన్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులతో జిల్లా పునర్విభజన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన శాసనసభ్యులు కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ వాదనలు వినిపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు పాలన సౌలభ్యం కలిగేలా ఉండాలని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అన్ని అర్హతలున్న గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని మాజీ మంత్రి డీకే అరుణ, అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ (కాంగ్రెస్‌) మంత్రివర్గ ఉపసంఘం దష్టికి తెచ్చారు. అలాగే తమ ప్రాంత ప్రజలకు అనుగుణంగా ఉండేందుకు కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్, కొడంగల్‌లను కలిపి షాద్‌నగర్‌ జిల్లాగా చేయాలని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోరారు. జిల్లాల పునర్విభజన కారణంగా మండలాల ప్రజలు చెల్లాచెదురయ్యే పరిస్థితి తీసుకురావద్దని, అందరికీ ఆమోదయోగ్యంగా విభజన ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు. వనపర్తిని జిల్లా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జిల్లాను ఖరారుచేయాలని ఎమ్మెల్యే చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) కోరారు.  వనపర్తి, నాగర్‌కర్నూల్‌లకు ప్రత్యామ్నాయంగా కల్వకుర్తినే జిల్లాగా చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్‌ఎస్‌) విజ్ఞప్తి చేశారు. ఇందులో నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, షాద్‌నగర్‌ నియోజకవర్గాలను కలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల్, ఆమన్‌గల్‌ మండలాలను కొత్తగా ఏర్పడే ఇబ్రహీంపట్నం జిల్లాలో కలిపే యోచనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు మండలాలను కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఉంచి రెవెన్యూ డివిజన్‌ మంజూరు చేయాలన్నారు. ఇక తరతరాలుగా అన్యాయానికి గురవుతున్న నారాయణపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. మండలాలు, జిల్లా విభజన జనాభా ప్రాతిపదికన జరగాలని, దీనిపై పూర్తిస్థాయి కసరత్తు చేయాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌyŠ  కోరారు. అచ్చంపేటను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వస్తోందని, ఆయా ప్రజల మనోభావాలకనుగుణంగా వ్యవహరించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. కల్వకుర్తిని జిల్లాగా మార్చాలని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి (కాంగ్రెస్‌) మంత్రివర్గ ఉపసంఘం దష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రు జూపల్లి కష్ణారావు, లక్ష్మారెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మక్తల్‌ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
Advertisement