సిరిసిల్లలో డిజిటల్‌ మీటర్లు | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో డిజిటల్‌ మీటర్లు

Published Sat, Jul 30 2016 6:44 PM

డిజిటల్‌ మీటరు బిగిస్తున్న సిబ్బంది

  • విద్యుత్‌ చౌర్యం నివారణకు ‘సెస్‌’ శ్రీకారం 
  • సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) పరిధిలో డిజిటల్‌ విద్యుత్‌ మీటర్లు అమరుస్తున్నారు. ‘సెస్‌’ పరిధిలోని తొమ్మిది మండలాల్లో పాత విద్యుత్‌ మీటర్లు తొలగిస్తూ, కొత్త వాటిని అమర్చేందుకు ‘సెస్‌’ పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో ఇంటింటికీ డిజిటల్‌ స్కానింగ్‌ మీటర్లు బిగిస్తున్నారు. డిజిటల్‌ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టనున్నారు. 
    ప్రయోగాత్మకంగా ఏర్పాటు... 
    సిరిసిల్ల ‘సెస్‌’ పరిధిలో 1,32,546 ఇంటి మీటర్లు ఉండగా.. వాటిలో తొలి విడతగా పది వేల మీటర్లకు ప్రయోగాత్మకంగా డిజిటల్‌ మీటర్లు అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సిరిసిల్ల డివిజన్‌లోని వేములవాడ, సిరిసిల్ల, చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాల్లోని గృహావసరాలకు పాత మీటర్లు ఉన్నాయి. వీటితో కొందరు విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారు. ‘సెస్‌’ పరిధిలో ఇదివరకు 18 శాతం ఉండే లైన్‌ లాస్‌ ఇప్పుడు 35 శాతానికి చేరింది. లైన్‌లాస్‌కు విద్యుత్‌ చౌర్యమే కారణమని భావించిన ‘సెస్‌’ పాలకవర్గం పాత మీటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో డిజిటల్‌ మీటర్‌కు రూ.830 ఖర్చవుతుంది. ఆ ఖర్చును సంస్థే భరిస్తుంది. వీటిద్వారా మీటరు రీడింగ్‌ను కూడా స్కానింగ్‌ ద్వారా నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇంట్లో ఏ విధంగా విద్యుత్‌ వాడుకుంటున్నా రీడింగ్‌ నమోదవుతుంది. 
    గతంలో చైనా మీటర్లు 
    గతంలో చైనా మీటర్లను సిరిసిల్ల పట్టణంలో అమర్చారు. వీటిని మరమగ్గాలకు అమర్చడంతో విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగించకపోయినా ఎక్కువ రీడింగ్‌ వస్తుందని పలువురు ఆరోపించారు. దీంతో వాటి బిగింపును నిలిపేశారు. ఇప్పుడు తాజాగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్‌ మీటర్లను సంస్థ అమరుస్తోంది. ‘సెస్‌’ పరిధిలో బిల్లింగ్‌ నమోదు చేసే 40 సిబ్బంది సిరిసిల్లలో ఇంటింటికీ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది వినియోగదారులు అభ్యంతరాలు చెబుతున్నా.. రీడింగ్‌లో మార్పులు ఉండవని హామీ ఇస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement