ప్రత్యక్ష నియామకాలే! | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష నియామకాలే!

Published Mon, Dec 26 2016 1:33 AM

ప్రత్యక్ష నియామకాలే!

విద్యుత్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై సర్కారు యోచన
వెయిటేజీ మార్కులు 20 నుంచి 40కి పెంచేందుకు చర్యలు
విధివిధానాల రూపకల్పన బాధ్యత ట్రేడ్‌ యూనియన్లకు
ఇదే అదునుగా కొన్ని సంఘాల నేతల వసూళ్ల దందా


సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు న్యాయపర చిక్కులు తలెత్తనున్నాయా? వారిని నేరుగా క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి రాష్ట్ర ప్రభు త్వవర్గాలు. నేరుగా క్రమబద్ధీకరిం చేందుకు అవకాశం లేనందున.. ప్రత్యక్ష నియామకాల (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ప్రకటన ద్వారా వారికి ఉద్యోగావకాశం కల్పించడం ఒక్కటే మార్గమ ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరిని దశల వారీగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ గత నెలలో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ విధివిధా నాలను రూపొందించి వచ్చే ఏడాది మార్చి లోగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో సుమారు 21 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే ఆ ఉద్యోగుల క్రమబద్ధీ కరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుగా మారనున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

 దీంతో ప్రత్యక్ష నియామకాల ప్రక్రియ ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ప్రత్యక్ష నియామక ప్రక్రి య ద్వారా పోస్టుల భర్తీలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 20 వెయిటేజీ మార్కు లను ఇచ్చేందుకు కోర్టు తీర్పులు అనుమతి స్తున్నాయి. వెయిటేజీ మార్కులను 20 నుంచి 40కు పెంచాలని, దీంతో పోస్టులన్నీ ఔట్‌ సోర్సింగ్‌ అభ్యర్థులకే దక్కుతాయని ప్రభు త్వం వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నట్లు తెలి సింది. ఈ మేరకు వేయిటేజీ మార్కుల పెంపు నకు సంబంధిం చిన నిబంధనలను సవరించే అవకాశాలపై పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్ష నియామకాల ప్రకటన ద్వారా నిరుద్యోగులందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని, అదనపు వెయిటేజీ మార్కు లతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను మాత్రమే భర్తీ చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సుప్రీం మార్గదర్శకాల ప్రకారం మరో విధానాన్ని అనుసరిస్తే 50 శాతం పోస్టు లను తాత్కాలిక ఉద్యోగులతో భర్తీ చేసేందుకు వీలుందని, మిగిలిన 50 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ 21 వేల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 42 వేల పోస్టులను భర్తీ చేయాల్సి రానుండడంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసే అవకాశం లేదు.

సంఘాల వసూళ్ల దందా..
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాల తయారీ బాధ్యతను ట్రాన్స్‌కో యాజ మాన్యం ట్రేడ్‌ యూనియన్లకు అప్పగిం చింది. విధివిధానాలు రూపొందించు కుని రావాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫెడరేషన్‌(టఫ్‌)కు లేఖ ఇచ్చింది. దీన్నే అవకాశంగా భావించిన కొన్ని సంఘాలు క్రమబద్ధీకరణ పేరుతో ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల నుంచి వసూళ్ల దందాకు తెరలేపాయి. తమ యూనియన్లలో సభ్యత్వం ఉంటేనే క్రమబద్ధీకరణకు అవకాశముందని పేర్కొంటూ కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. సభ్యత్వ రుసుం పేరుతో కొన్ని యూనియన్లు ఒక్కో కార్మికుడి నుంచి రూ.350 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని 21 వేల మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఉండడంతో మొత్తం వసూళ్లు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటాయని ఓ కార్మిక నేత అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement