అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై వివాదం | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Published Tue, Apr 25 2017 1:57 AM

అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై వివాదం - Sakshi

పాలకోడేరు: పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయతలపెట్టిన బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని మరో వర్గం వారు రాత్రికిరాత్రి తరలించడంతో దళి తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా మారి ధర్నా, రాస్తారోకోకు దారితీసింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గరగపర్రు గ్రామానికి చెందిన దళితులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని బస్టాండ్‌ సెంటర్‌లో తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఆదివారం రాత్రి విగ్రహాన్ని తెచ్చి ఆ ప్రాంతంలో ఉంచారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన కొందరు పంచాయతీ కార్యదర్శి సహకారంతో విగ్రహాన్ని తరలించి పాత పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. విషయం తెలిసిన దళితులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున సర్పంచ్‌ ఉన్నమట్ల ఎలిజబెత్‌ ఇంటికి వెళ్లి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. సర్పంచ్‌ ఎస్సీ అయినా ఆందోళనకారులకు భయపడి ఇంట్లోంచి రాలే దు. అక్కడి నుంచి దళితులు గ్రామంలో ఊరేగింపుగా నినాదాలు చేస్తూ  భీమవరం–తాడేపలి్లగూడెం రహదారిపై బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో సాగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 
 
వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి..
వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, దళిత ఐక్యవేదిక, వైఎ స్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా సుందర్‌కుమార్, జిల్లా మాలమహానాడు నాయకులు గుమ్మాపు వరప్రసాద్, మాలమహానాడు జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు మంతెన యోగీం ద్ర కుమార్‌ తదితరులు ఇక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ దశలో కొందరు ఆందోళనకారులు వాటర్‌ ట్యాం క్‌ ఎక్కి నిరసన తెలిపారు. నరసాపురం సబ్‌కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ఆందో ళనకారులతో చర్చించారు. విగ్రహం ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతం అభ్యంతరకరమైందని, వేరేచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు దళితులు ససేమిరా అన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించాలని, విగ్రహం తీసుకువచ్చి ఆ ప్రాంతంలో పెట్టాలని, లేకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చివరకు పాత పంచాయతీ కార్యాలయం వద్ద విగ్రహం ఏర్పాటుకు సబ్‌కలెక్టర్‌ స్థలం ప్రతిపాదించడంతో ఆందోళన ముగిసింది.  
 
ఉండి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి
బుట్టాయగూడెం: అంబేడ్కర్‌పై ప్రేమను తెలుగుదేశం పార్టీ  నాయకులు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహం తొలగించడంపై ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సమాధానం చెప్పాలని నల్లి రాజేష్‌ డిమాండ్‌ చేశారు.
 

Advertisement
Advertisement