దూర ‘మిథ్య’ | Sakshi
Sakshi News home page

దూర ‘మిథ్య’

Published Mon, May 8 2017 11:38 PM

దూర ‘మిథ్య’

  • 19 నెలలైనా ప్రకటించని పరీక్షల షెడ్యూల్‌
  • 36 వేల మంది విద్యార్థుల నిరీక్షణ
  • లేటరల్‌ ఎంట్రీ విద్యార్థులదీ ఇదే పరిస్థితి
  •  కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు
  •  

     ఎస్కేయూ:

     వర్సిటీలో నిర్ధేశించిన క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించలేదని  ఉన్నతాధికారులపై  విద్యార్థులు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సోమవారం వర్సిటీ ఉన్నతాధికారులు కోర్టుకు హాజరయ్యారు.  వర్సిటీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ (వర్సిటీ తరుపున న్యాయవాది)  అనంతపురం కోర్టులో తమ వాదనలు వినిపించారు.  పరీక్షలు నిర్వహించలేదని విద్యార్థులు  కోర్టుకు వెళ్లడం ఇదే తొలిసారి.

    కుదరని సమన్వయం :

              దూరవిద్య విభాగంలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు 19 నెలల కిందట పూర్తి అయ్యాయి. అప్పటి నుంచి పరీక్షలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా దూరవిద్య అడ్మిషన్లు, దూరవిద్య పరీక్షలను వేర్వేరు చేశారు. రెగ్యులర్‌ డిగ్రీ, పీజీ పరీక్షలు, దూరవిద్య పరీక్షలను ఒకే గూటికి చేర్చి ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ను నియమించారు.  ఈ నిర్ణయం  ఉద్దేశం బాగున్నా  విజయవంత కాలేదు. నామినల్‌ రోల్స్‌ పంపాలని ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్, దూరవిద్య డైరెక్టర్‌ను కోరగా, మొదట పరీక్షల తేదీలు ప్రకటించండి. అనంతరం నామినల్‌ రోల్స్‌ పంపుతానని దూరవిద్య డైరెక్టర్‌ బదులిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణంగా పరీక్షల షెడ్యూల్‌ ప్రకటన కొలిక్కి రాకుండా పోతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు డైరెక్టర్లు  పరస్పరం లిఖిత పూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవడంతో పుణ్యకాలం గడిసిపోతోందని సమాచారం. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇవ్వకుండా సప్లిమెంటరీ విద్యార్థులతో ఫీజు ఎలా కట్టించుకోవాలని దూరవిద్య డైరెక్టర్‌ ఉన్నతాధికారుల ఎదుట తన వాదన వినిపించారు.

    విద్యార్థుల గోడు పట్టేదెవరికి

                దూరవిద్య డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం , లేటరల్‌ ఎంట్రీ విద్యార్థులు 36 వేల మంది పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికీ రెండో సంవత్సరం సగం అయిపోయి పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలు కూడా పూర్తి కాలేదు. ఫలితంగా కోర్సు కాల వ్యవధి పెరిగే ప్రమాదం ఏర్పడింది. వర్సిటీ ఉన్నత పదవులు చేపట్టడానికి ఎంతో ఆసక్తి చూపే ప్రొఫెసర్లు, తాజా పరిస్థితుల్లో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌   రెడ్డివెంకటరాజు వ్యక్తిగత కారణాలు రీత్యా పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. దూరవిద్య డైరెక్టర్‌   వెంకటనాయుడు ఇప్పటికే పలుమార్లు రాజీనామా చేసినప్పటికీ ..ఆయనను కొనసాగించాలనే  వర్సిటీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అధికార విభజన సజావుగా చేయకపోవడం, ఆయా డైరెక్టర్లు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు స్పష్టంగా పేర్కొనకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.   

Advertisement
Advertisement