గండికోట ‘గండం’ | Sakshi
Sakshi News home page

గండికోట ‘గండం’

Published Fri, Sep 8 2017 3:49 AM

Distribution of compensation gandikota

సుమారు రూ.5 కోట్ల మేర రికవరీకి కసరత్తు
మొదటగా 85 చెక్కుల మతలబుపై నివేదిక
రకరకాల ప్రణాళికలతో దోచేసిన వైనం
22 చార్జిషీట్లు నమోదు చేసిన అధికారులు
ప్రభుత్వానికి చేరినా.... వేటులో తాత్సారం


సాక్షి, కడప : గండికోట పరిహారం పంపిణీ విషయంలో జరిగిన అవకతవకలు ప్రస్తుతం అధికారులను వెంటాడుతున్నాయి. ఆర్డీఓ వినాయకంతోపాటు తహసీల్దార్లు, కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు చేసిన తప్పులకు ఎలాంటి శిక్ష పడుతుందోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. ఇచ్చిందే చెక్కు..çపంచిందే పరిహారం అన్న తరహాలో అధికారులు అడిగేవారు ఉండరన్న తరహాలో ముందుకు వెళ్లారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే, అవకతవకల వ్యవహారం కూడా బయటికి పొక్కదని భావించి ఎవరికి వారు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులోనూ గండికోట పరిహారం విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో  కలెక్టర్‌ స్పందించి విచారణ చేపట్టారు. జేసీ–2 శివారెడ్డి నేతృత్వంలో పరిహారం పంపిణీపై కూలంకషంగా విచారణ జరగ్గా, మరోపక్క ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా కూడా విచారణ చేయించి అవకతవకలను తేల్చారు. గండికోట పరిహారం పంపిణీలో దాదాపు రూ.70 నుంచి రూ.75కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించారు.

85 చెక్కులు..22 చార్జిషీట్లు
గండికోట ప్రాజెక్టు పరిధిలోని కొండాపురం, ముద్దనూరు మండలాల్లోని 21 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి తొలుత 14 గ్రామాల్లోని 9,098 కుటుంబాలకు రూ.479కోట్ల పరిహారం మంజూరు చేసి పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే పంపిణీలో ఇష్టానుసారంగా అనుకూలురు, ఇతర దళారులతో కుమ్మక్కై కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఒకే ఇంటిలో ఉన్న భార్యాభర్తలకు సంబంధించి విడిపోయినట్లు సర్టిఫికెట్లు సృష్టించడం మొదలుకొని, మైనర్లు మేజర్లుగా చూపించడం వరకు చాలా అవకతవకలు చేశారు. అంతేకాకుండా స్థానికేతరులకు సైతం చెక్కులు అందినట్లు విచారణలో నిగ్గుతేలింది. పరిహారానికి సంబంధించి అప్పట్లో అధికారులకు ఇచ్చిన రేషన్‌కార్డును ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చూస్తే సంబంధిత పరిహారం తీసుకున్న వారి పేరు బదులు మరోపేరు కనిపిస్తుండడం లాంటి ఎన్నో వింతలు, విశేషాలు కనిపించాయి. పెద్ద ఎత్తున అవినీతి విచారణలో వెలుగుచూడడంతో జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించారు. ఆర్డీఓతోపాటు కొంతమంది కిందిస్థాయి అధికారులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు విచారణలో తేలిన నేపథ్యంలో కలెక్టర్‌ కూడా ప్రభుత్వానికి కూలంకషంగా నివేదిక సమర్పించారు. రెవెన్యూపరంగా రికార్డు చేసిన దాదాపు 22 చార్జిషీట్లను నమోదు చేయడంతోపాటు 85 చెక్కుల విషయంలో అవకతవకలను నిర్ధారించారు.

రూ.5కోట్ల రికవరీకి నివేదిక
85 చెక్కులను పక్కదారి పట్టించిన నేపథ్యంలో సంబంధిత అధికారులతోపాటు తీసుకున్న లబ్ధిదారుల నుంచి రికవరీ చేయాలని కోరారు. మొదటగా రూ.5 కోట్ల రికవరీకి ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తదుపరి చర్యలకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా రికవరీ విషయంలో తటపటాయించినా, తీసుకున్న సొమ్ము ఇవ్వకుండా కథలు చెప్పే వారిపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేసే ఆలోచనలో కూడా జిల్లా యంత్రాంగం ఉంది.

సచివాలయంలో ఏం జరుగుతోంది?
అవకతవకల ఫైలు సచివాలయం చేరినా చర్యలు తీసుకునేం దుకు అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారన్నది అర్థం కావడం లేదు. పరిహారం సొమ్మును పక్కదారి పట్టించిన కీలక అధికారి తన పలుకుబడితో నివేదికను తొక్కిపెట్టేలా చేస్తున్నారని విమర్శలున్నాయి. గండికోట విషయంలో ఎందుకు నాన్చుతున్నారో ప్రభుత్వ పెద్దలకే ఎరుక!
 

Advertisement
Advertisement