‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు! | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు!

Published Sat, Jul 1 2017 2:30 AM

‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు!

‘రైతురథం’ కింద జిల్లాకు 520 సబ్సిడీ ట్రాక్టర్లు
మండలానికి 6–10 వరకు కేటాయించే అవకాశం
దందాకు తెరలేపిన అధికార పార్టీ నేతల అనుచరులు
మార్గదర్శకాలు రాకనే పైరవీలు


కర్నూలు : రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీకి ఉద్దేశించిన ‘రైతురథం’ పథకం  కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు బ్రహ్మరథంగా మారుతోంది. తాము చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇవ్వాలంటూ ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. వారి అనుచరులు ఒకడుగు ముందుకేసి.. ట్రాక్టర్లు ఇచ్చేది తమ వారికేనంటూ  మండలాల వారీగా జాబితాలు తయారుచేసే పనిలో పడ్డారు. ఇదే అదనుగా ట్రాక్టర్లు ఇప్పిస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు 520 ట్రాక్టర్లు వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు.

జిల్లాలో 54 మండలాలను లెక్కిస్తే ఒక్కో మండలానికి  6 నుంచి 10 ట్రాక్టర్లు వచ్చే   అవకాశముంది. వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పోటీ ప్రారంభమయ్యింది. దీన్ని అదనుగా చూసుకుని కొద్ది మంది అమ్యామ్యాలకు తెరలేపారు. దీనికితోడు జిల్లాలో మొత్తం అర్హుల జాబితాను ఇన్‌చార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలో సిద్ధం చేయనుండడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు దక్కేది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇన్‌చార్జ్‌ మంత్రికే అధికారాలు!
రైతురథం పథకం కింద ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయ పనిముట్లకు ఒక్కో దానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాను ఇన్‌చార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీఏ)తో కలిసి తయారుచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో నియోజకవర్గాల వారీగా జాబితాల తయారీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు చేపడుతున్నారు. ఇదే అదనుగా కొద్ది మంది వారి అనుచరులు కమీషన్లకు తెరలేపారు. మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి... మీకు ట్రాక్టర్‌ ఇప్పిస్తామని ఆశలు రేపుతున్నారు. మరికొంత మంది అధికార పార్టీ నేతలు బినామీ పేర్లతో దరఖాస్తు చేయించేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాక్టర్ల పంపిణీకి ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలు రాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని ట్రాక్టర్లు కేటాయించిన విషయమూ ఇంకా తమకు తెలియలేదని అంటున్నారు.

ఇవీ నిబంధనలు
=    రైతురథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీస రెండెకరాల పొలం ఉండాలి.
=    అప్పటికే సబ్సిడీ కింద ట్రాక్టర్లను తీసుకుని ఉండరాదు.
=    దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే ట్రాక్టర్‌ ఉంటే అనర్హుడు.
=    ఆధార్, పాస్‌బుక్‌లను చూపించి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి.
=    దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
=    వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు. ఇన్‌చార్జ్‌ మంత్రి, జేడీఏ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇన్‌చార్జ్‌ మంత్రి కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు,  నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చెప్పిన వారినే ఎంపిక చేసే అవకాశముంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement