మెడికల్‌ కాలేజ్‌కి డీఎన్‌బీ పోస్టులు | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజ్‌కి డీఎన్‌బీ పోస్టులు

Published Fri, Aug 19 2016 11:17 PM

DNB posts

నిజామాబాద్‌అర్బన్‌ :ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు ఎట్టకేలకు డీఎన్‌బీ(డిప్లొమా ఇన్‌ నేషనల్‌ బోర్డు) పోస్టులు మంజూరయ్యాయి. కళాశాల ఏర్పడిన ఏడాదిలోనే డిప్లొమా పోస్టులకు అనుమతి లభించింది. అనంతరం డీఎన్‌బీ కోర్సులకు సంబంధించి ఢిల్లీ నుంచి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెండుసార్లు కళాశాలకు వచ్చి, విభాగాల వారీగా వసతులను పరిశీలించిన అనంతరం పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత నిజామాబాద్‌లో మాత్రమే డీఎన్‌బీ పోస్టులను కేటాయించారు. దీని ద్వారా వైద్యులు ఆయా విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేషన్, పోస్టు డిప్లొమా కొనసాగిస్తారు. జనరల్‌ మెడిసిన్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌కు –4, జనరల్‌ సర్జరీ పోస్టు గ్రాడ్యుయేషన్‌–2, గైనిక్‌ విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌కు –6, మత్తుమందు విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌కు –6 సీట్లు కేటాయించారు. రూ. 8 లక్షల ఉపకార వేతనంగా ఇవ్వనున్నారు. గతంలో చిన్నపిల్లల విభాగంలో రెండు సీట్లను కేటాయించారు. ప్రస్తుతం 18 సీట్లతో మొత్తం 20 డీఎన్‌బీ పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి 40 మంది సీనియర్‌ రెసిడెన్సియల్‌ వైద్యులను కేటాయించారు. వీరికి మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇందిర గురువారం విధులను కేటాయించారు. అన్ని విభాగాలకు సంబంధించి సీనియర్‌ రెసిడెన్షియల్‌ వైద్యులు అందుబాటులో ఉన్నారు. వీరు స్థానికంగా ఉండి వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది.
 

Advertisement
Advertisement