Sakshi News home page

అయ్యో...ఫిజియో లేదయ్యో..!

Published Tue, Jan 17 2017 11:07 PM

అయ్యో...ఫిజియో లేదయ్యో..! - Sakshi

– రెండ్రోజులుగా అందుబాటులో లేని ఉద్యోగులు
– అవస్థలు పడుతున్న బాధితులు
– సర్వజనాస్పత్రిలో దయనీయ పరిస్థితి


అనంతపురం మెడికల్‌ : ఇక్కడ హాయిగా కుర్చీలో కూర్చొని కునుకుతీస్తున్న వ్యక్తి పేరు రంగారెడ్డి (72). అనంతపురంలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కుడి భుజం, మోకాలు నొప్పిగా ఉండడంతో ఈనెల 13, 14 తేదీల్లో సర్వజనాస్పత్రిలో ఫిజియోథెరపీ చేయించుకున్నాడు. 16వ తేదీ మరోసారి రావాలని చెప్పడంతో సోమవారం వచ్చాడు. సిబ్బంది లేరు. తిరిగి మంగళవారం వచ్చాడు. మధ్యాహ్నం అయినా ఎవరూ రాలేదు. ఫిజియోథెరపీ చేసే గదిలోనే ఉంటే ఎవరొచ్చినా లేపి వైద్యం చేస్తారనుకుని ఇలా నిద్రలోకి జారుకున్నాడు. చివరకు ‘డ్యూటీ సమయం’ ముగిసినా ఎవరూ రాకపోవడంతో నిరాశతో నిట్టూర్పుగా ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.  

పక్షవాతమొచ్చినా..కాళ్లూచేతులు పడిపోయినా.. కదలికలు తెప్పించగల శక్తి ఫిజియోథెరపీ వైద్యానికి ఉంది.నడుమునొప్పి.. మెడ నొప్పి.. వెన్నునొప్పి.. ఇలా ఏ నొప్పి నుంచైనా ఉపశమనం కల్పించగల శక్తి  ‘ఫిజియోథెరపీ’కి ఉంది. డిస్క్‌ ఆపరేషన్లయినా..ఇతర ఏ సర్జరీ తర్వాత అయినా మునుపటిలా కోలుకోవడానికి తోడ్పడే ఇలాంటి వైద్యంపై సర్వజనాస్పత్రి సిబ్బందిలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది.

    రెండ్రోజుల నుంచి ఈ విభాగం సిబ్బంది ఎవరూ సంబంధిత గదిలో అందుబాటులో లేరంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు వారు విధులకు వస్తున్నారో.. లేదో కూడా తెలియని పరిస్థితి. ఫిజియోథెరపీ చేయించుకునేందుకు వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది.    ఈనెల 13, 14వ తేదీల్లో ఫిజియోథెరపీ చేయించుకున్న వారు సోమవారం (16వ తేదీ) మరోసారి థెరపీ కోసం ఆస్పత్రికి వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం లేదు. ‘ఆ విభాగం తలుపులు తెరిచి ఉన్నాయే’ అన్న మాటేగానీ విధులకు సిబ్బంది ఎవరూ రాలేదు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి. సుమారు 15 మంది వరకు బాధితులు వివిధ నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు వేచి చూశారు. అయినా సిబ్బంది రాలేదు.   విసుగు చెంది సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేరు. దీంతో ఆర్‌ఎంవీ వైవీ రావు వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘అందరూ ఫిజియోథెరపీ గది వద్దే ఉండండి.. సిబ్బంది వస్తారు’ అని ఆయన చెప్పినా ఫలితం లేదు. మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూసిన బాధితులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై ఆర్‌ఎంఓ డాక్టర్‌ వైవీ రావును అడగ్గా సమస్యను సంబంధింత హెచ్‌ఓడీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అత్యవసరంగా సెలవు పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

ఒకర్నయినా ఉంచల్ల కదా
కొన్నాళ్లుగా నడుము నొప్పి ఎక్కువగా ఉంది. ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గుతుందని చెబితే ఉదయాన్నే వచ్చినా.. కానీ ఇక్కడెవరూ లేరు. అధికారులకు వెళ్లి చెబితే ఎవర్నో పంపుతామన్నారు. ఎవర్నో ఒకర్ని ఉంచల్ల కదా?. ఏం పెద్దాస్పత్రో ఏమో..!
-  సన్నెప్ప, గలగల, గుమ్మఘట్ట మండలం

నడవలేకున్నా
కొన్ని రోజులుగా కాళ్ల వాపులు ఎక్కువగా ఉన్నాయి. నడవడానికి కావడంలేదు. నరాలన్నీ బిగుతయ్యాయి. ఇక్కడ వైద్యం చేయించుకుంటే బాగుంటుందని వస్తే ఎవరూ లేరు. పొద్దున్నుంచీ ఉన్నా. ఇలా ఎవరూ రాకపోతే ఎలా?
- కావేరమ్మ, కోవూరునగర్, అనంతపురం

పని వదిలిపెట్టి వచ్చా
నేను ఆటో నడిపితేనే ఇల్లు గడుస్తుంది. ఈనెల 13, 14 తేదీల్లో ఫిజియోథెరపీ చేయించుకున్నా. 15వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం రమ్మన్నారు. రోజూ వస్తున్నా..ఈ రోజు (మంగళవారం) కూడా ఇదే పరిస్థితి. ఇంత అధ్వానంగా ఉంటే ఎలా?  
- పీరా, స్టాలిన్‌నగర్, అనంతపురం

Advertisement
Advertisement