హంద్రీనీవాను పూడ్చకపోతే చాలు | Sakshi
Sakshi News home page

హంద్రీనీవాను పూడ్చకపోతే చాలు

Published Sun, Nov 27 2016 11:46 PM

హంద్రీనీవాను పూడ్చకపోతే చాలు - Sakshi

- కాల్వ విస్తరణ విషయంపై చెరుకులపాడు నారాయణరెడ్డి 
- ఆలోచించాలని జిల్లా ప్రజాప్రతినిధులకు హితవు
మద్దికెర : హంద్రీనీవా కాలువను ఇరువైపులా విస్తరిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సాకుతో పూడ్చే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ఆరోపించారు. ఆదివారం మద్దికెరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా కాలువను వైఎస్సార్‌ 90 శాతం పూర్తిచేశారన్నారు. మిగతా పనులు పూర్తి చేసి అనంతర ప్రభుత్వం నీటిని విడుదల చేసిందన్నారు. రైతులు, ప్రజలు వైఎస్‌ను తలుచుకుంటుంటే సహించలేక టీడీపీ ప్రభుత్వం కాలువ విస్తరణను తెరపైకి తెచ్చిందన్నారు. కాల్వను విస్తరించి 40 టీఎంసీల నీటిని వదులుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు కాల్వను గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాల్వను విస్తరించడానికి బదులు  డోన్, ప్యాపిలి, గుత్తి మీదుగా కుప్పం వరకు కొత్త కాల్వను ఏర్పాటు చేసి నీటిని తీసుకుపోవచ్చన్నారు. వెడల్పు చేసేందుకు కనీసం పదేళ్లు పడుతుందని, అంతవరకు   కాలువకు నీరు వదలరన్నారు. అదే జరిగితే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాల్వ విస్తరణకు భూసేకరణ చేపట్టాలని,  అలాంటప్పుడు కొత్త కాలువ ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా నీటిని అందించే అవకాశం ఉంటుందని, దీనిపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు  చర్చించాలన్నారు. విషయాన్ని సీఎంకు వివరించాలని డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కోరారు. విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్‌ మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, నాయకులు సర్కార్‌ వెంకటరాముడు, బాలచంద్ర, నాగేష్, చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మంజునాథ్‌రెడ్డి, రామాంజులు, చౌరెడ్డి వన్నాల గోవిందు  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement