రెవెన్యూ వ్యవస్థకు చెడ్డపేరు తేవొద్దు | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వ్యవస్థకు చెడ్డపేరు తేవొద్దు

Published Fri, Nov 11 2016 10:51 PM

రెవెన్యూ వ్యవస్థకు చెడ్డపేరు తేవొద్దు

  • ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు
  • గిద్దలూరు :
    వీఆర్వోలు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డపేరు తేకుండా సన్మార్గంలో నడవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళారులు వీఆర్వోల పేర్లు చెప్పి రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, రైతులతో నేరుగా మాట్లాడాలని, ఆ వెంటనే తహసీల్దార్‌కు విషయం చెప్పి వారి పని చేసి పెట్టాలని బొప్పరాజు సూచించారు. 
     
    రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకునే పరిస్థితి తెచ్చుకుని వారికి రెవెన్యూ వ్యవస్థపై వ్యతిరేక భావం వచ్చేలా చేయవద్దని కోరారు. కింది స్థాయిలో రెవెన్యూ సేవలు పటిష్టంగా ఉండాలని చెప్పారు. విమర్శలకు తావివ్వకుండా పనిచేయాలని కోరారు. రెవెన్యూకు పూర్వవైభవం రాబోతోందని, త్వరలో రాష్ట్రంలో 18 రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటవుతాయని, ఆర్‌డీఓ స్థాయిని పెంచి కలెక్టర్‌ స్థాయి అధికారి వస్తారని చెప్పారు. రెవెన్యూ విధానం బ్రిటీషు కాలం నాటి నుంచి ఉందని, అప్పటి నుంచి మనం సేవలు చేస్తున్నాం తప్ప ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోయామని, వాటిని ఇప్పుడిప్పుడే సాధించుకోవడంలో మిగిలిన డిపార్ట్‌మెంట్‌ల కంటే మనం ముందున్నామన్నారు.
     
    అధికార పార్టీ నాయకుల విమర్శలను తిప్పి కొట్టేందుకు మనం తప్పులు చేయకుండా ఉండాలన్నారు. 468 జీఓ ద్వారా 4,600 మంది వీఆర్వోలను రెగ్యులర్‌ చేయించినట్లు బొప్పరాజు చెప్పారు. గౌరవ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ప్రసూతి సెలవులు మంజూరు చేయించామని, సమైక్యాంధ్ర ఉధ్యమంలో పాల్గొన్న వీఆర్‌ఏలకు మిగిలిన అధికారులతో సమానంగా రెండు నెలల వేతనం ఇప్పించడంలో సఫలమయ్యామన్నారు. 
     
    ఉద్యోగులకు సంఘం నిరంతరం అండగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిబంధనల మేరకు పనులు చేసుకుంటూ రెవెన్యూను కాపాడాలని బొప్పరాజు కోరారు. అనంతరం ఆయన్ను వీఆర్వోల సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.విజయలక్ష్మి, డీటీ పి.కాదర్‌వలి, వీఆర్వోల సంఘ జిల్లా కార్యదర్శి వైపీ రంగయ్య, కృష్ణా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, సీసీఎల్‌ఏ అధ్యక్షుడు హరిప్రసాద్, సిటీ అధ్యక్షుడు పుల్లయ్య, స్థానిక వీఆర్వోల సంఘ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement