మమ్మల్ని ‘మెదక్‌’లో కలపొద్దు | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ‘మెదక్‌’లో కలపొద్దు

Published Sun, Oct 2 2016 9:59 PM

నిరసనకారులతో ఫోన్‌‌లో మాట్లాడుతున్న సునీతారెడ్డి

జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డిలో కలపాలని ఆందోళన
సెల్‌ టవర్‌ ఎక్కిన టీఆర్‌ఎస్ నాయకులు.. అఖిలపక్షం రాస్తారోకో

జిన్నారం: జిన్నారంతో పాటు నూతనంగా ఏర్పాటుకానున్న గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. మెదక్‌ జిల్లాలో ఈ రెండు మండలాలను కలిపే విధంగా కొందరు నాయకులు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు కుమార్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, మౌసిన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు.

వీరికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు గుమ్మడిదల ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో చేపట్టారు. నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి కూడా సెల్‌టవర్‌ ఎక్కినవారిని కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తాము కూడా రెండు మండలాలను సంగారెడ్డిలో కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా చేస్తున్న అఖిలపక్ష నాయకులకు మద్దతు ప్రకటించారు. కాగా, నిరసనకారులు ఎంతకీ సెల్‌ టవర్‌ దిగకపోవటంతో అధికార పార్టీ నేతలు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త  ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సమాచారం అందించారు.

ఆయా మండలాలను సంగారెడ్డిలో కొనసాగించేలా సీఎంతో చర్చిస్తున్నామని, ఆందోళనలు విరమించాలని నిరసనకారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. దీంతో నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్సై ప్రశాంత్‌.. నిరసనకారులను కిందికి దించారు. ధర్నాలో కాంగ్రెస్‌ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ ప్రభాకర్‌, ఇతర పార్టీల నాయకులు గిద్దెరాజు, చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్‌, నరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, శ్రీకాంత్‌రెడ్డి, మద్ది వీరారెడ్డి, గోవర్ధన్‌గౌడ్‌‌, మంగయ్య తదితరులున్నారు.

Advertisement
Advertisement