ఈ-నామ్‌లో పంట కొనుగోలుకు వ్యాపారుల వెనుకంజ | Sakshi
Sakshi News home page

ఈ-నామ్‌లో పంట కొనుగోలుకు వ్యాపారుల వెనుకంజ

Published Wed, Oct 5 2016 11:52 PM

వ్యాపారులతో మాట్లాడుతున్న మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు, ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి

  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పూర్తిస్థాయిలో ఈ-నామ్‌కు శ్రీకారం
  • సౌకర్యాలు లేవని కొనుగోలుకు నిరాకరించిన వ్యాపారులు
  • కొనుగోళ్లు చేయాలని రైతుల ఆందోళన
  • వ్యాపారులతో సమావేశమైన అధికారులు
  • అసంతృప్తిగా పంట ఉత్పత్తులు కొనుగోళ్లు  చేసిన వ్యాపారులు
  • ఖమ్మం వ్యవసాయం :జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానానికి ఖమ్మం వ్యాపారులు  వెనకంజ వేస్తున్నారు.ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌(ఈ-నామ్‌)ను జాతీయ స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.రైతుల పంట ఉత్పత్తులకు గరిష్ఠ ధర లభించడమే కాకుండా కొనుగోలులో పారదర్శకత ఉండేటట్లు ఈ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.దీని ద్వారా జాతీయ స్థాయిలోని వ్యాపారులు కూడా పంట ఉత్పత్తిని డిమాండ్‌ మేరకు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.దీంతో రైతులకు పోటీ ధర రావటమే గాక, వ్యాపారికి అవసరమైన మేరకు సరుకు  కొనుగోలు సౌకర్యం లభిస్తుంది.బుధవారం నుంచి వ్యాపారులు పంట ఉత్పత్తికి నిర్ణయించిన ధరను రహస్యంగా ఈ-బిడ్‌ చేసే  విధానాన్ని మార్కెటింగ్‌ శాఖ అమల్లోకి తీసుకువచ్చింది.
    సౌకర్యాలు లేక కొనుగోళ్లకు నిరాకరించిన వ్యాపారులు
    ఈ-నామ్‌కు పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవని సరుకు కొనుగోలుకు వ్యాపారులు నిరాకరించారు.
    మార్కెట్‌లో ఈ-నామ్‌కు  సరియైన సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే వ్యవస్థను అమలు చేయడం సరైందికాదని బుధవారం పంట ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేశారు.పంట ఉత్పత్తుల నాణ్యతలను గుర్తించడానికి ఉపయోగించే పరికరాలు, ప్రయోగశాలలు ఉండాలన్నారు.వాటి ఆధారంగా పంట ఉత్పత్తుల్లో నాణ్యత గుర్తించి ఆ ప్రమాణాల ప్రకారమే ధరను ఈ-బిడ్‌ చేస్తామని వ్యాపారులు పేర్కొన్నారు.
    రైతుల ఆందోళన
     వ్యాపారులు సరుకులను కొనుగోలు చేయకపోవడంతో  పెసర, పత్తి పంట ఉత్పత్తులు విక్రయానికి తెచ్చిన రైతులు ఆందోళనకు దిగారు.ఈ-నామ్‌ పట్ల అవగాహన లేని రైతులు తమ పంట ఉత్పత్తులను కొనుగోళ్లు చేయించాలని అధికారులను నిలదీశారు. పంట ఉత్పత్తులు , రైతులు తక్కువగా ఉండటంతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. జేసీ ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డిని వ్యాపారులతో మాట్లాడి పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    వ్యాపారులతో అధికారుల సమావేశం
    ఈ-నామ్‌ ప్రక్రియను పటిష్టంగా అమలుకు సహకరించాలని ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ఈ-నామ్‌ ప్రత్యేకాధికారి జేడీ లక్ష్మణుడు, డిప్యూటీ డైరెక్టర్లు మల్లయ్య, ప్రసాద్‌ రావులు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ-నామ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరలో జరుగుతాయన్నారు. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే విధానం కాదన్నారు.
    అసంతృప్తిగా కొనుగోళ్లు
    ప్రభుత్వ శాఖల అధికారుల ఆదేశాలను గౌరవిస్తున్నామని, విధానం సంతృప్తికరంగా లేకున్నా.. అసంతృప్తిగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఉపక్రమించారు. వ్యాపారులు పంట ఉత్పత్తుల  నాణ్యతలను పరిశీలించి ధరలను బిడ్‌ చేశారు. అధిక ధరలు పెట్టిన వ్యాపారులకు సరుకులను విక్రయించే విధంగా మార్కెటింగ్‌ శాఖ చర్యలు తీసుకుంది.
     

Advertisement
Advertisement