వసూల్‌ రాణిపై విచారణంటేనే హడల్‌! | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాణిపై విచారణంటేనే హడల్‌!

Published Tue, May 16 2017 10:38 PM

వసూల్‌ రాణిపై విచారణంటేనే హడల్‌!

చేతులెత్తేసి తప్పుకున్న డీపీఓ 
వసూళ్లపై ప్రాథమికంగా నిర్థారణ  
విచారణాధికారిగా జేసీ–2 రాధాకృష్ణ నియామకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వసూళ్ల రాణిపై విచారణ అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఎం.బాలామణిపై శాఖాపరమైన విచారణ చేయలేనంటూ స్వయంగా ఇన్‌చార్జి డీపీఓ టీవీఎస్‌జీ కుమార్‌ చేతులెత్తేశారు. డీపీఓ కార్యాలయ ఏఓ బాలామణి పంచాయతీ కార్యాదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయాన్ని గత నెల 29న ‘వసూళ్ల రాణి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో గత నెల 30న ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ వసూళ్ల వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ డీపీఓ కుమార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన డీపీఓ నలుగురైదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను విచారించి వసూళ్ల విషయం వాస్తవమేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. విచారణ ముందుకు వెళితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమనే నిర్థారణకు రావడంతో అధికార పార్టీ నేతలు విచారణను అడ్డుకునే ప్రయత్నాలకు తెరతీశారు.
కాకినాడలోని డీపీఓ కార్యాలయంలో అన్ని వ్యవహారాలు తెలిసి పరోక్షంగా ఆధిపత్యం చెలాయించే ఒక రిటైర్డ్‌ డీపీఓ కూడా విచారణను ముందుకుసాగకుండా అడ్డుతగులుతున్నారని కార్యాలయ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అసలే ఇన్‌చార్జి బాధ్యతలు, తనను డీపీఓగా నియమించిన కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ బదిలీపై వెళ్లిపోవడంతో ఇప్పుడు అనవసర రాద్ధాంతం నెత్తిన పెట్టుకోవడం ఎందుకనుకున్నారో ఏమో గానీ డీపీఓ కుమార్‌ హఠాత్తుగా విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవడం కార్యాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది.   కలెక్టర్‌ అప్పగించిన బాధ్యతల మేరకు డీపీఓ అప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభమైన నాలుగు రోజులకే అధికార పార్టీ నేతలు అడ్డుచక్రం వేయడం మొదలుపెట్టారు. విచారణ నివేదిక ‘కర్ర విరగకండా...సామెత మాదిరిగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఇంతలో డీపీఓ విచారణలో వసూళ్ల వ్యవహారం వాస్తవమేనని  ప్రాథమికంగా ఒక నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఆ సమయంలోనే విచారణ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. 
ఈ క్రమంలో డీపీఓ స్థానంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. వసూళ్ల వ్యవహారంపై డీపీఓ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జేసీ–2ను లోతైన విచారణకు కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే విచారించిన గ్రామ కార్యదర్శులతో పాటు కోనసీమలోని పలువురు కార్యదర్శులను విచారించాల్సి ఉందని చెబుతున్నారు.

Advertisement
Advertisement