గమ్యం చేరని స్వప్నం | Sakshi
Sakshi News home page

గమ్యం చేరని స్వప్నం

Published Sun, Jan 8 2017 12:12 AM

గమ్యం చేరని స్వప్నం - Sakshi

- ఎస్‌ఐ సెలెక‌్షన్స్‌లో అపశ్రుతి
- పరుగు పందెంలో ఆగిన కానిస్టేబుల్‌ గుండె 
- మరో ఇద్దరికి అస్వస్థత 
 
కర్నూలు(హాస్పిటల్‌): చిన్న వయస్సులోనే పోలీస్‌ ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నారు. అనంతరం జీవితంలో మరింత ఉన్నతంగా స్థిరపడాలని కలగన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ సెలెక‌్షన్స్‌కు సిద్ధమయ్యారు. పరుగు పందెంలో గమ్యన్ని చేరుకోకుండానే గుండె ఆగి అతని పోరాటం నిలిచింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం కర్నూలులో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పూజారి తండా గ్రామానికి చెందిన దేనేనాయక్, ధర్మినిబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శ్రీనివాస నాయక్, బాలాజీ నాయక్‌ కుమారులు. శ్రీనివాస నాయక్‌ తండ్రితో పాటు వ్యవసాయం చేస్తుండగా బాలాజీ నాయక్‌ డిగ్రీ వరకు చదువుకుని 2007 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం అతను అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ (పీసీ నెం.602)గా పనిచేస్తున్నారు. ఉద్యోగం వచ్చాక ప్రేమించిన ముస్లిం యువతిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇక జీవితంలో మరింత ఉన్నతంగా స్థిరపడాలని భావించి ఎస్‌ఐ ఎంపిక పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని కర్నూలు వచ్చారు. శనివారం ఉదయమే స్థానిక ఏపీఎస్‌పీ 9వ బెటాలియన్‌లో నిర్వహించిన ఎస్‌ఐ సెలెక‌్షన్స్‌ పరుగు పందెంలో పాల్గొన్నారు. అయితే గమ్యానికి చేరుకోలేక మధ్యలోనే అతను తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే అధికారులు అతన్ని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతని బీపీ, పల్స్‌ కొట్టుకోవడం ఆగిపోయినా వైద్యులు చేసిన చివరి ఫలితంచలేదు. దీంతో అతను మరణించినట్లుగా ధ్రువీకరించారు. వెంటనే పోలీసులు సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.   
 
మరో ఇద్దరికి అస్వస్థత
ఎస్‌ఐ ఎంపికలో భాగంగా నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న మరో ఇద్దరు అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సత్యం అనంతపురంలోని 14 ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆయన 1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన కుమ్మరి రామచంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ స్టడీ సర్కిల్‌లో రీజనింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఎస్‌ఐ సెలక‌్షన్స్‌లో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్నారు. వీరిద్దరు మధ్యలోనే అస్వస్థతకు గురవడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.  
  
అభ్యర్థులు సరైన జాగ్రత్తలు పాటించాలి
బాలాజీ నాయక్‌ మృతదేహాన్ని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ  సందర్శించారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకుని పాల్గొనాలని ఆయన సూచించారు. ఆయన వెంట  ఎస్‌బీ డీఎస్పీ బాబూ ప్రసాద్,   సీఐలు మధుసూదన్‌రావు, నాగరాజరావు, శివన్నారాయణ, సిబ్బంది ఉన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement