వానాకాలంలోనూ వలసలే.. | Sakshi
Sakshi News home page

వానాకాలంలోనూ వలసలే..

Published Wed, Jul 13 2016 1:32 AM

వానాకాలంలోనూ వలసలే..

తప్పని బతుకుపోరు
ఖేడ్‌ను వీడని కరువు ఛాయలు
మూగజీవాలూ వలస బాట
నిజాంసాగర్ వైపు పశువుల తరలింపు
మొదలుకాని సాగు పనులు పాడి రైతులు ఆగం
ఖరీఫ్‌పై ఆశలు ఆవిరే!

వానాకాలంలోనూ ఖేడ్‌ను వీడని కరువు ఛాయలు... తాగేందుకు నీళ్లు లేక.. మేసేందుకు గ్రాసం దొరక్క మూగ జీవాలు విలవిల్లాడుతున్నాయి. వీటిని పోషించేందుకు పాడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మంజీర ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. సరైన వర్షాలు లేకపోవడంతో ఈసారి రైతులు ఇంకా సాగు పనులు మొదలు పెట్టలేదు. అడపాదడపా వర్షాల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. పశువులను బతికించుకునేందుకు పాడి రైతు వలస బాట పడుతున్నాడు. నెలన్నర గడిచినా వానలు లేకపోవడంతో కాలం కలిసొచ్చేలా లేదంటూ రైతన్న కన్నీరు పెడుతున్నాడు.

నారాయణఖేడ్ : మంజీర నది పూర్తిగా ఎండిపోయింది. భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. చుక్క నీటికీ కష్టంగానే ఉంది. వానా కాలంలోనూ పరిస్థితి మారలేదు. పశుపక్షాదులు మంచి నీటికోసం అవస్థ పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వేసవిలో ప్రభుత్వం కల్హేర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు వద్ద పశుసంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. పశువులకు దాణా, తాగునీటి  ఇబ్బందులు తీర్చింది. పలు గ్రామాల రైతులు తమ పశువులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. వర్షాకాలం ప్రారంభం కాగానే ఈ కేంద్రాన్ని ఎత్తివేయడంతో రైతులు తమ పశువులనుు స్వగ్రామాలు, తండాలకు తరలించుకెళ్లారు.

వర్షాకాలం వచ్చినా వర్షాలు ముఖం చాటేశాయి. నెలన్నర గడుస్తున్నా వర్షాల జాడ లేదు. తుంపర్ల వర్షంతో కనీసం గడ్డికూడా మొలవలేదు. వర్షాభావం వల్ల గ్రామాల్లోని చెరువులు, కుంటలు ఎండిపోయే ఉన్నాయి. దీంతో తాగేందుకూ నీరు కరువైంది. రైతులు చేసేదిలేక మూగజీవాలను బతికించుకునేందుకు ఏటా వేసవిలో వెళ్లేలా నిజాంసాగర్ పరీవాహకానికి, బంజెపల్లికి వలస వెళ్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో పశువులను తోడుకెళ్తున్నారు.

బక్కచిక్కిన మూగజీవాలు..
గ్రాసం, నీటి సమస్య కారణంగా పశువులు బక్కచిక్కాయి. వాటి గోసను చూడలేక రైతులు గ్రాసం, నీరున్న చోటకు తోడుకెళ్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గేదెలు 72,504, ఆవులు 83,684, గొర్రెలు 1,36,982, మేకలు 88,078 వరకు ఉన్నట్టు పశుసంవర్థకశాఖ అధికారుల అంచనా. ఇందులో సగానికిపైగా పశువులు వలసబాట పడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇలాగే వర్షాభావ పరిస్థితులుంటే మిగతా పశువులు సైతం వలస బాట పట్టాల్సిందే.

పంటల సాగు ఇలా...
నియోజకవర్గం మొత్తంలో 60,392 హెక్టార్లలో వివిధ రకాల సాధారణ సాగు కాగా గత ఏడాది 69,109హెక్టార్ల మేర పంటలు సాగుచేశారు. వర్షాలు సమృద్ధిగా ఉంటే ఈ సాగువిస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. కానీ వర్షాభావం ఫలితంగా చాలామంది రైతులు పెసర, మినుము, కంది పంటలు సాగు చేయలేకపోయారు. జూలై మొదటివారంలోగా ఈ పంటలు విత్తుకుంటేనే సరైనదిగుబడులు వస్తాయి. కానీ అదను దాటిపోయినా ఇంకా రైతులు వర్షాల కోసమే చూస్తున్నారు. భూముల్లో నాగలితో దున్నితే మూడు ఇంచులులోపు పొడిమట్టే వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ విత్తనాలు విత్తుకునేందుకు 50నుండి 60 మిల్లీమీటర్ల మేర భూమి తడిస్తేనే విత్తనం బతికి మొలకెత్తుతుందని, లేదా వేడికి చనిపోతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

వర్షపాతం ఇలా...
ఖేడ్ మండలంలో జూన్‌లో సాధారణ వర్షపాతం 122మి.మీ కాగా, 106 మి.మీ మాత్రమే కురిసింది. జూలై మాసంలో సాధారణ వర్షపాతం 221మి.మీ కాగా ఇప్పటివరకు 53 మి.మీ. మాత్రమే పడింది. కంగ్టి మినహా నియోజకవర్గంలోని ఖేడ్, మనూరు, పెద్దశంకరంపేట, కల్హేర్ మండలాల్లో వర్షపాతం పరిస్థితి ఇలాగే ఉంది.

 పొంచి ఉన్న వ్యాధులు...
నిజాంసాగర్ ప్రాంతంలో ఇతర జిల్లాల పశువులు కూడా వస్తుండడంతో గొంతువాపు, గాలికుంటు వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. ఏటా వసల వెళ్లిన పశువులు అంటువ్యాధుల బారిన పడి మరణించిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. నిండు వర్షాకాలంలోనూ వర్షాలు లేక పాడి పశువులు, పంటలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement