ముగ్గురు డీఎస్పీల సస్పెన్షన్ | Sakshi
Sakshi News home page

ముగ్గురు డీఎస్పీల సస్పెన్షన్

Published Tue, Jul 5 2016 8:01 AM

DSP, 3 other policemen suspended in AP

సాక్షి, విశాఖపట్నం: రాష్ర్టంలో ముగ్గురు డీఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ జె.వి.రాముడు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఎం.కృష్ణమూర్తి నాయుడు, సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు, ఏసీబీ డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావులపై డీజీపీ వేటు వేశారు. 2010లో విశాఖలో ఒక సివిల్ కేసుకు సంబంధించిన సుమారు 70 ఫైళ్లు రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో అదృశ్యమయ్యాయి. దీనిపై బెంచ్ క్లర్క్ ఎన్‌వీఎస్ దుర్గాప్రసాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు క్రైం నంబర్.89/2010 యు/ఎస్ 457 అండ్ 380 ప్రకారం కేసు నమోదైంది. ఆ సమయంలో కృష్ణమూర్తి విశాఖ సిటీ ఏసీపీగా, ప్రసాదరావు, వైవి నాయుడులు టూ టౌన్ సీఐలుగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇంత వరకూ ఎలాంటి పురోగతి లేదు.

ఇటీవల నగర సీపీగా బాధ్యతలు చేపట్టిన టి.యోగానంద్ పెండింగ్ కేసులపై దృష్టి సారించారు. ఫైళ్ల మాయం కేసు దర్యాప్తు బాధ్యతను క్రైం డీసీపీ టి.రవికుమార్‌మూర్తికి అప్పగించారు. ఆయన ఇచ్చిన నివేదికను సీపీ యోగానంద్ డీజీపీకి పంపించారు. ఆ నివేదిక ప్రకారం ఈ ముగ్గురు డీఎస్పీలు అప్పట్లో ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని భావించిన డీజీపీ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ కేసును ఈ ముగ్గురిలో ఒకరైన వై.వి.నాయుడు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement