ప్రభుత్వ స్థలంలో తారు ప్లాంట్‌ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలంలో తారు ప్లాంట్‌

Published Sat, Oct 1 2016 12:51 AM

dumber plant in assigned land

  • భూమి కబ్జా, అనుమతి లేకుండా నిర్మాణం
  • అసైన్ట్‌ భూమిని లీజ్‌కు ఇచ్చిన రైతు?
  •  
    పాలకుర్తి టౌన్‌ : ప్రభుత్వ పంచరాయి భూమిని దర్జాగా కబ్జా చేసి అక్రమంగా డాంబర్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న629 సర్వే నెంబర్‌లో రూ.లక్షల విలువైన 196 ఎకరాల ప్రభుత్వ పంచరాయి భూమి ఉంది. ఈ భూమిని గతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అసైన్డ్‌ చేసింది. ఈ భూమిని సాగుకు ఉపయోగించుకోవాలే తప్ప అమ్మడం కానీ లీజ్‌కు ఇవ్వడం కానీ చేయొద్దనే నిబంధనలు ఉన్నా పాలకుర్తికి చెందిన ఓ రైతు భూమిని డాంబర్‌ ప్లాంట్‌ నిర్వాహకులకు లీజ్‌కు ఇచ్చినట్లు సమాచారం, దీంతో ఆ స్థలంలో కొన్ని నెలలగా ప్లాంట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే, కళ్లెదుట అనుమతి తీసుకోకుండా ప్లాంట్‌ నిర్మిస్తున్నా రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    కబ్జాకు గురైన అసైన్డ్‌ భూములు
    మండల కేంద్రంలో రూ.కోట్ల రూపాయల విలువైన అసైన్డ్‌ భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నారు. నిరుపేదలు భూమి సాగు చేసుకోవడానికి ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ముఫ్పై ఏళ్ల క్రితం భూమి లేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం 265 ఎకరాల భూమిని మూడు విడతలుగా పంపిణీ చేసింది. 566, 629 సర్వే నెంబర్లలో జనగామ, రఘనాథపల్లి రోడ్డు పక్కన ఈ భూములు ఉన్నాయి. అయితే,  జనగామ రోడ్డులో ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కస్తూర్భా బాలికల గురుకుల పాఠశాలకు రెండు ఎకరాలు ఇచ్చారు. కూషిగుట్ట పక్కన స్టోన్‌ క్రషర్స్‌ యాజమానులు కొంత భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. ఇకనైనా అధికారులు స్పందించి భూమిన కబ్జాదారుల పరం కాకుండా చూడాలని స్థానికులు కొరుతున్నారు. 
     
    భూమి స్వాధీనం చేసుకుంటాం
    భూక్యా భన్సీలాల్‌, తహసీల్దార్‌, పాలకుర్తి
    డాంబర్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నది ప్రభుత్వ పంచరాయి భూమి అని తేలితే సీజ్‌ చేస్తాం. ఇక రైతులకు ఇచ్చిన అసైన్డ్‌ భూమిని ఇతరులకు లీజుకు ఇవ్వడం, అమ్ముకోవడం చట్టవిరుద్ధం. ఇలా ఎవరైనా చేస్తే ఆయా భూములు స్వాధీనం చేసుకుంటాం.
     

Advertisement
Advertisement