నకిలీ రిజిస్ట్రేషన్లకు చెక్ | Sakshi
Sakshi News home page

నకిలీ రిజిస్ట్రేషన్లకు చెక్

Published Tue, Jun 28 2016 8:32 AM

Duplicate registrations to check

సీడీఎంఏ అసెస్‌మెంట్ నంబరు ఆధారంగా
ఇళ్ల రిజిస్ట్రేషన్లు  వెబ్‌సైట్లో వివరాల నమోదు
అమల్లోకి స్టాంప్ ట్రాకింగ్

జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో చోటుచేసుకుంటున్న నకిలీలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. నిబంధనలను కఠినతరం చేసి నకిలీలకు చెక్ పెట్టేలా కార్యాచరణ రూపొందించారు. దీన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

చిత్తూరు (కార్పొరేషన్): మున్సిపాలిటీల పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్లకు అధికారులు చెక్ పెట్టనున్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లను వాటి అసెస్‌మెంట్ నంబరు (మున్సిపాలిటీ శాఖ వారు ఇచ్చే నివాస ప్రాపర్టీ ట్యాక్స్ నంబరు) ఆధారంగా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా చేస్తుండడంతో అక్రమాలకు చెక్ పడింది. అదే తరహాలో మున్సిపాలిటీ శాఖ సీడీఎంఏ (కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) డేటాలో ఉండే అసెస్‌మెంట్ నంబరు ఆధారంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయనున్నారు. జిల్లాలో తిరుపతి, పుత్తూరు మున్సిపాలిటీల్లోనే ప్రస్తుతం సీడీఎంఏ డేటా సక్రమంగా ఉంది.

 గతంలో ఇలా..
గతంలో మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు మూడు రకాలుగా చేసేవారు. 1.ఆర్‌సీసీ శ్లాబ్ ఇల్లు, 2.మిద్ది మేడలు, 3.పెంకుటిల్లుగా విభజించేవారు. వాటి డోర్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసేవారు. ఈ విధానం వల్ల అధికారుల వద్ద ఉన్న సమాచారానికి, క్షేత్రస్థాయిలోని సమాచారానికి తేడాలు ఉండేవి. రెండు అంతస్తులు ఉన్న వారు కూడా ఒక అంతస్తుగా చూపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉండేది. ఒకే నంబరు మీద రెండు, మూడు గృహాలను రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. తద్వారా కొనుగోలుదారులు, విక్రయదారులు, భాగస్వాముల మధ్య గొడవలు జరిగేవి. కోర్టుల వరకు వెళ్లేవారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా అక్రమ రిజిస్ట్రేషన్‌పై 75 కేసులు నమోదయ్యాయి.

 ప్రసుత్తం ఇలా..
అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టడానికి మున్సిపాలిటీ అధికారులు నివాసాల వివరాలను సీడీఎంఏ వె బ్‌సైట్‌లో నిక్షిప్తం చేయనున్నారు. అందులో గృహానికి సంబంధించిన అన్ని వివరాలతో పాటు మున్సిపాలిటీ శాఖ వారు ఇచ్చే నివాస ప్రాపర్టీ ట్యాక్స్ నంబరును వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా నకిలీలకు అవకాశం లేకుండా పోతుందని అధికారులు చెబుతున్నారు. నిజమైన యజమాని హక్కులకు భంగం కలగదు. సీడీఎంఏ ద్వారా తిరుపతి, పుత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఐదు నెలల్లో రెండు వేల రిజిస్ట్రేషన్‌లను అధికారులు విజయవంతంగా చేపట్టారు. రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకం, కొనుగోలుదారులు, సాక్షులు తమ ఆధార్ కార్డుల వివరాలను సమర్పించాల్సి ఉంది.
స్టాంప్ ట్రాకింగ్
స్టాంప్ ట్రాకింగ్ అమల్లోకి తీసుకురానున్నారు. నాసిక్‌లో ప్రింట్ అయిన తర్వాత స్టాంపులు ఏ విధంగా ఆయా కార్యాలయాలకు చేరింది. ప్రసుత్తం అది ఎక్కడ ఉంది. ఆన్‌లైన్‌లో పరిశీలన చేయొచ్చు. ఈ-చలానా చెల్లింపులు సైతం అమల్లోకి రానున్నాయి.

సీడీఎంఏ వెబ్‌లో వివరాలు నమోదు చేస్తున్నాం
తిరుపతి, పుత్తూరు మినహా మిగిలిన మున్సిపాలిటీలలో సీడీఎంఏ వెబ్‌సైటులో వివరాలు సక్రమంగా నమోదు కాలేదు. అందుకే అక్కడ ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్కడ కూడా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. స్టాంప్ ట్రాకింగ్, ఈ-చలానా విధానాల వల్ల కూడా లోపాలను సరిదిద్దవచ్చు.  - రమేష్, డెరైక్టర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ

Advertisement
Advertisement