హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్ | Sakshi
Sakshi News home page

హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్

Published Sat, Oct 31 2015 1:24 AM

హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్ - Sakshi

♦ ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ ఆగస్టు 26న
♦ ఒంటికి నిప్పంటించుకున్న చేబ్రోలు వాసి
♦ పట్టించుకోని సర్కారు, తెలుగుదేశం నేతలు
♦ పరిస్థితి విషమించి శుక్రవారం ఏలూరు ఆసుపత్రిలో కన్నుమూత
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలకులతోనూ, మృత్యువుతోనూ చేసిన పోరాటంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఓడిపోయారు. హోదా డిమాండ్‌తో రెండు నెలల కిందట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఏలూరులోని ప్రభుత్వాసుపత్రిలో కన్నుమూశారు. మెరుగైన వైద్యం అందిస్తే తన భర్త బతుకుతాడని దుర్గాప్రసాద్ సతీమణి అధికార పార్టీ నేతలను ఎన్నిసార్లు కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.

సాయం మాట దేవుడెరుగు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆత్మాహుతి యత్నానికి పాల్పడి ఏలూరు, విజయవాడ, గుంటూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన దుర్గాప్రసాద్‌ను కనీసం పలకరించిన పాపాన పోలేదు. శుక్రవారం కన్నుమూసిన ఆయన భౌతికకాయం చూసేందుకూ ఒక్క టీడీపీ నేత రాకపోవడం దురదృష్టకరం. ‘‘మంత్రిని కలిశాం. ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాం. ఎవరూ స్పందించలేదు. వైద్యానికి మా వద్ద పైసా కూడా లేదు. ప్రభుత్వం సాయం చేసి ఉంటే నా భర్త బతికేవాడు’’ అని దుర్గాప్రసాద్ సతీమణి జ్యోతి  శుక్రవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం దుర్గాప్రసాద్ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. బంధువుల అశ్రునయనాలు, గ్రామస్తుల ప్రత్యేక హోదా నినాదాల మధ్య శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

 కుమార్తెకు ఉద్యోగం రాదన్న ఆవేదనతో...
 కొన్నేళ్ల కిందట హైదరాబాద్ నుంచి చేబ్రోలు తిరిగొచ్చేసిన దుర్గాప్రసాద్ (50) కుటుంబం కైకరంలో హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కుమార్తె నిఖిలకు స్థానికత సమస్య రావడంతో డీఎస్సీ ఉద్యోగం రాదేమోనని బెంగపడేవాడు. చివరకు డీఎస్సీ పరీక్ష రాసేందుకు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందాల్సి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఇటువంటి సమస్యలన్నీ తీరతాయని దుర్గాప్రసాద్ భావించేవాడు. అందుకు తనవంతు యత్నంగా వివిధ పార్టీల నేతలను కలిసి వినతిపత్రాలు అందించేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టు 25న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా రాదేమోనని చేసిన వ్యాఖ్యలతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అదే విషయం ఆలోచిస్తూ ఆగస్టు 26 తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
 
 హోదా కల్పిస్తే ఇలాంటి ఘటనలు జరగవు
 దుర్గాప్రసాద్ మృతిపట్ల జగన్ ఆవేదన
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోవడం, తన కుమార్తె స్థానికత సమస్య కారణంగా ఉద్యోగం రాదేమోనన్న మానసిక బెంగతో గత ఆగస్టు 26 న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన దుర్గాప్రసాద్ మరణంపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత సమస్య తలెత్తడంతో తన కూతురు ఉద్యోగ నియామకాలకు సంబంధించి పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి అర్హత కోల్పోతుండటంతో ఆవేదనతో దుర్గాప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడటంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉండేది కాదని పేర్కొన్నారు. దుర్గాప్రసాద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement
Advertisement