Sakshi News home page

నోట్ల రద్దుపై అనుభవం లేకనే ఇక్కట్లు

Published Thu, Jan 5 2017 3:30 AM

నోట్ల రద్దుపై అనుభవం లేకనే ఇక్కట్లు

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు
విజయవాడ (వన్ టౌన్): నోట్ల రద్దు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగకపోవటం వల్ల అటు ప్రభుత్వ పెద్దలకు గానీ, ఆర్‌బీఐ అధికారులకు గానీ దాని అనుభావాలు తెలియలేదని, దీని వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. ఆర్‌బీఐ పని కేవలం నగదును ముద్రించి జారీ చేయటం మాత్రమే కాదన్నారు.

దేశంలో బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరించటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, వడ్డీ రేట్లను సమీక్షించటం, ధరల పెరుగుదలను అరికట్టడం వంటి అనేక రకాల బాధ్యతలను ఆర్‌బీఐ నిర్వహిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది చాలా దేశాల్లో జరిగే ప్రక్రియేనని చెప్పారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని ముందుగా ప్రకటిస్తే దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. కానీ నోట్ల రద్దు ఎందుకు చేశారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ పెద్దలు పలు రకాల ప్రకటనలు చేయటంతో తాను అయోమయానికి గురయ్యానని చెప్పారు.

నోట్ల రద్దు ఫలితాలు మాత్రం ఇప్పటికిప్పుడు రావని, వాటికి రెండు మూడేళ్ల సమయం పడుతుందన్నారు. రానున్న కాలంలో పన్ను మీద ఆదాయం కనీసం రూ.50 వేల కోట్ల మేర రాకుంటే మాత్రం ఈ నిర్ణయం వృథా ప్రయత్నమేనని అభిప్రాయపడ్డారు. కాగా, నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజలకు వ్యక్తమవుతున్న సందేహాలకు ఆర్‌బీఐ గవర్నర్‌ వంటి వ్యక్తులు సమాధానాలిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Advertisement

What’s your opinion

Advertisement