డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా | Sakshi
Sakshi News home page

డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా

Published Tue, Aug 6 2013 3:02 AM

Dvakra members Swaha money

 నాతవరం, న్యూస్‌లైన్ : డ్వాక్రా సభ్యులను మోసగించి వారి సొత్తును ఓ ఉద్యోగి స్వాహా చేసిన ఉదంతం అధికారుల విచారణలో వెలుగు చూసింది. తమను నమ్మించి రూ.లక్షలు స్వాహా చేసిన సీఏ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని శ్రీనందేశ్వర గ్రామైక్య సంఘం సభ్యులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  సీఏ స్వాహా చేసిన సొమ్ముపై విచారణ జరపాలని వారం రోజుల క్రితం డ్వాక్రా సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై మూడు రోజులుగా సీసీ నాగ్వేరరావు విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఏపీఎం శివప్రసాద్ సోమవారం గ్రామంలో కొన్ని డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. మండలంలో గన్నవరం పంచాయతీ శివారు వై.బి.పట్నంలో 29 డ్వాక్రా సంఘాలున్నాయి. ఇక్కడ సీఏగా పనిచేస్తున్న టి.అప్పారావు ఓబీలు, డ్వాక్రా సంఘాల సభ్యులను తప్పుదోవ పట్టించి స్త్రీనిధి పథకం ద్వారా సభ్యులకు మంజూరైన మొత్తం సొమ్ములో  సుమారు రూ. 2 లక్షలు స్వాహా చేశారని  ఏపీఎం శివప్రసాద్, సీసీ నాగేశ్వరరావుకు మహిళలు ఫిర్యాదు చేశారు.
 
ఈ గ్రామంలో స్త్రీనిధి పథకం ద్వారా వివిధ గ్రూపులకు నిధులు విడుదల చేసినట్టు రికార్డుల్లో ఉన్న విషయాన్ని వారు  ఏపీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవంగా రికార్డుల్లో ఉన్నదానికి, సభ్యులకు ఇచ్చిన దానికి పొంతన లేకుండా ఉందని తెలిపారు. ఈ సభ్యులకు మే నెలలో సుమారు రూ.7.75 లక్షల  రుణాలు ఇచ్చినట్టు చూపించి సభ్యులకు ఆ మొత్తాన్ని ఇవ్వకుండా స్వాహా చేసినట్టు వారు ఆరోపించారు. కొం దరి పేరున రుణాలు మంజూరు చేసి వారికి పూర్తిగా ఇవ్వకుండా సగం సొమ్ము స్వాహా చేశారని తెలిపారు.

రుణాలు ఇవ్వాలంటే ప్రతి గ్రూపూ లంచాలు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. తాము రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నా సీఏ ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా కాజేశారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఏపీఎం మాట్లాడుతూ సీఏ అప్పారావు నిబంధనలు ఉల్లంఘించి పనిచేసిసట్టు తమ దృష్టికి వచ్చిందని, అతనిని విధుల నుంచి తప్పించి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.
 

Advertisement
Advertisement