ఈ–మార్కెట్‌ కొనుగోళ్లు

7 Sep, 2016 23:39 IST|Sakshi
వనపర్తి వ్యవసాయ మార్కెట్‌
 •  నేటినుంచి వనపర్తి మార్కెట్‌యార్డులో ప్రారంభం 
 •  ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు - లాభపడనున్న రైతన్నలు 
 •  
  వనపర్తి: శాస్త్రీయ పద్ధతిలో పంట ఉత్పత్తులకు నాణ్యతను బట్టి ధర నిర్ణయించాలని ప్రభుత్వం రూపొందిస్తున్న నామ్‌ (నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) ఈ–కొనుగోలు విధానాన్ని గురువారం నుంచి వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అమలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 44మార్కెట్‌ యార్డుల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. గురువారం తాజాగా మరికొన్ని మార్కెట్లలో ఈ–కొనుగోలు విధానం అమలుకానుంది. ఇందుకోసం మార్కెట్‌యార్డు అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు వ్యాపారులకు, కమీషన్‌ ఏజెంట్లకు ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై శిక్షణ ఇవ్వనున్నట్లు వనపర్తి మార్కెట్‌ యార్డు కార్యదర్శి నరసింహ తెలిపారు. అధికారులు బుధవారం ఆన్‌లైన్‌ కొనుగోళ్ల ప్రాక్టీస్‌ కోసం కమీషన్‌ ఏజెంట్లకు, ట్రేడర్లకు ఆన్‌లైన్‌లో టెండర్లు వేయాలని మొదటి ట్రైనింగ్‌ తరహాలో టెండర్లు పంపించాలని సూచించారు. గురువారం నుంచి అధికారికంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
   
  ఈ– కొనుగోళ్ల విధానం ఇలా..
  ఇదివరకు ఇబ్బడిముబ్బడిగా రైతులు మార్కెట్‌ యార్డుకు సరుకులు తీసుకురావటం, కమీషన్‌ ఏజెంట్లు సరుకును చేతిలోకి తీసుకుని పరిశీలించి ధర నిర్ణయించేవారు. మార్కెట్‌లో ఈ– కొనుగోలు విధానం ప్రారంభించిన తర్వాత పూర్తిగా కాగితరహిత విక్రయాలు నిర్వహించాల్సి ఉంటుంది. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే పంట ఉత్పత్తులను అధికారులు పంట రకం, ఎన్ని క్వింటాళ్లు తదితర వివరాలతో పాటు రైతు సెల్‌ నంబర్‌ను సేకరిస్తారు. సరుకు నాణ్యతను పరీక్షించి ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపరుస్తారు. కమీషన్‌ ఏజెంట్లు, ట్రేడర్స్‌ ఆయా సరుకుల వివరాలను ఆన్‌లైన్‌లో చూసి, వాటిని కొనడానికి ధరలను నిర్ణయించి ఆన్‌లైన్‌లో టెండర్లు సమర్పించాలి. వచ్చిన ధరలలో కెల్లా ఎక్కువ ధర కోడ్‌ చేసిన వారికి రైతులు సరుకు విక్రయించవచ్చు.
   ఈ–కొనుగోళ్లు ప్రారంభించగానే ధాన్యం నాణ్యత పరీక్షించించే ప్రత్యేక ల్యాబ్, కమీషన్‌ ఏజెంట్లు టెండర్లు వేసేందుకు కంప్యూటర్లను స్థానిక మార్కెట్‌ యార్డు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌ మొబైల్‌  ఉన్నవారు ఇంటర్నెట్‌ సౌకర్యంతో మొబైల్‌ ద్వారానే టెండర్లు పంపించుకునే అవకాశం ఉంటుంది.
   
  ఈ మార్కెట్‌ ఉపయోగాలు..
  • – ఈ విధానం ద్వారా రైతులు విక్రయానికి తీసుకువచ్చిన సరుకు కొనుగోలు కోసం కమీషన్‌ ఏజెంట్లు, ట్రేడర్స్‌ సమర్పించే టెండర్‌ దరఖాస్తుల్లో ఎక్కువగా కనిపించే దిద్దుకాలు, కొట్టివేతలు, పరిస్థితిని బట్టి మార్చేసే పరిస్థితి ఇక నుంచి చెక్‌పడనుంది.
  • – ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వల్లlపంటల నాణ్యతను బట్టి ధర లభించే అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉండే కమీషన్‌ ఏజెంట్లతో పాటు, ఆన్‌లైన్‌లో దేశ, విదేశాల నుంచి టెండర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన కొనుగోలుదారుల్లో పోటీ పెరిగి అన్నదాతకు ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యత పేరుతో జరిగే మోసాలకు చెక్‌ పడే అవకాశం ఉంది.
   
  అధికారికంగా నేడు ప్రారంభం 
  వనపర్తి మార్కెట్‌లో గురువారం నుంచి ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ– కొనుగోళ్లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వ్యాపారులకు అవగాహన కల్పిస్తాం.
  – నరసింహ, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్‌యార్డు, వనపర్తి
   
   
   
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు