ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఈ– ఔషధి’ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఈ– ఔషధి’

Published Sun, Feb 26 2017 2:42 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఈ– ఔషధి’

రోగుల వివరాల కంప్యూటరీకరణ
మందుల నిల్వలూ ఆన్‌లైన్‌లో..
త్వరలో వైద్యులు, ఫార్మాసిస్టులకు ల్యాప్‌టాప్‌లు


సర్కారు దవాఖానాల్లో వైద్యసేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ–ఔషధి విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో రోగుల వివరాలు, అందించిన చికిత్స వివరాలను కంప్యూటరీకరిస్తారు. రోగి సంపూర్ణ సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. తద్వారా రోగి ఆస్పత్రికి వెళ్లగానే.. ఆధార్‌ నంబర్‌ ఆధారంగా వైద్యులు వివరాలు తెలుసుకుని చికిత్స అందిస్తారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌) :  
గ్రామీణ ప్రాంత రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. కొన్నాళ్ల క్రితం పిట్లంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ–ఔషధిని ప్రారంభించిన వైద్యశాఖ.. ప్రభుత్వం దానిని కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయాలని నిర్ణయించింది. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కలిపి 41 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 కమ్యూనిటి హెల్త్‌సెంటర్లు, ఒక జిల్లా ఆస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. అన్ని ఆస్పత్రుల్లో ఈ– ఔషధి విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఆన్‌లైన్‌లో వైద్యసేవలు
వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలను గతంలో రిజిస్టర్లల్లో నమోదు చేసేవారు. కొత్త విధానంలో ఆ వివరాలను కంప్యూటర్‌లలో నమోదు చేస్తారు. వైద్యం కోసం వచ్చిన రోగుల వివరాలు, ఆధార్‌ నంబర్, వ్యాధి వివరాలతో పాటు చేసిన వైద్య పరీక్షలు, అందించిన చికిత్సలను అందులో పొందుపరుస్తారు. రోగులకు అందించిన మందులను ఫార్మసిస్ట్‌లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందే ప్రతి రోగికి సంబంధించిన వివరాలు, ఆరోగ్య పరిస్థితి, ఏ మందులు ఇచ్చారు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదవుతాయి.

ఇలా ఒకసారి కంప్యూటర్‌లో నమోదు చేయడం వల్ల వారి సంపూర్ణ సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఆస్పత్రికి వచ్చిన ప్రతిసారి రోగి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. రోగి ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయగానే అతడి వ్యాధికి సంబంధించిన సంపూర్ణ సమాచారం డెస్క్‌టాప్‌పై ప్రత్యక్షమవుతుంది. ఒక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి తగ్గకపోతే చాలా మంది వేరే ఆస్పత్రిని ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుత ఈ –ఔషధి విధానంలో రోగి ఆధార్‌ నంబర్‌ ఆధారంగా వారికి గతంలో అందించిన చికిత్సలు తెలుసుకుని వైద్యుడు త్వరగా చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది.

మందుల స్టాక్‌ వివరాలు ఆన్‌లైన్‌లో..
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలు, కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులకు ప్రభుత్వ పరంగా సరఫరా చేసిన మందులు, వాటి నిల్వలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మందుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement