ప్రజాసాధికార సర్వేలో జిల్లాకు రెండో స్థానం | Sakshi
Sakshi News home page

ప్రజాసాధికార సర్వేలో జిల్లాకు రెండో స్థానం

Published Mon, Aug 1 2016 11:42 PM

east second place in pulse survey

పిఠాపురం టౌన్‌ : ప్రజాసాధికార సర్వేలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. పిఠాపురంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇంతవరకూ జిల్లాలో 2,48,190 ఇళ్ల సర్వే పూర్తయిందని తెలిపారు. 7,12,642 మందికి సంబంధించిన సర్వే పూర్తయినట్టు వివరించారు. మొత్తం 2590 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, సామర్లకోట, తుని ప్రాంతాల్లో సర్వే మందకొడిగా సాగుతోందన్నారు. 20 డాక్యుమెంట్లకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటరు రోజుకు 14 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా 5 కూడా పూర్తి చేయడం లేదని తెలిపారు. ట్యాబ్‌లు పని చేయకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దే చర్యలు చేపడతామన్నారు. పని చేయని ట్యాబ్‌ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని జేసీ చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్‌ బి.సుగుణ, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ ఎంవీకే మాధవి ఉన్నారు.
సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి
కాకినాడ సిటీ : ప్రజాసాధికార సర్వేను కచ్చితత్వంతో త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సర్వే పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం ప్రతి ఎన్యూమరేటరూ సగటున రోజుకు 10 కుటుంబాల సర్వే నిర్వహిస్తున్నారన్నారు. సర్వే నిర్వహించే కుటుంబాలు ఏయే పత్రాలు, సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలో ప్రత్యేకంగా ముద్రించిన పత్రాలను ముందు రోజే పంపిణీ చేయడం ద్వారా సమయం కలిసివస్తుందని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. సర్వేలో తామిచ్చే సమాచారం వల్ల ప్రస్తుతం తమకు లభిస్తున్న ప్రయోజనాలు కోల్పోతామేమోననే సంకోచం కొంతమంది ప్రజల్లో ఉందని, దీనిని తొలగించేందుకు సర్వే వల్ల చేకూరే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ, ప్రజాసాధికార సర్వే ద్వారా జిల్లాలో 2,44,567 కుటుంబాలకు చెందిన 7,02,193 మంది వివరాలను ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్టు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి, ఎన్‌ఐసీ సీనియర్‌ సైంటిస్ట్‌ సయ్యద్‌ ఉస్మాన్, జెడ్పీ సీఈఓ కె.పద్మ పాల్గొన్నారు.

Advertisement
Advertisement