యూనివర్సిటీలో ఎడ్యు‘కేట్లు’ | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీలో ఎడ్యు‘కేట్లు’

Published Sat, Aug 6 2016 11:34 PM

ఎస్వీయూ ముఖద్వారం - Sakshi

 
– ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఇష్టారాజ్యం
– ఇద్దరి అధికారుల కనుసన్నల్లో ఐదు బీపీఈడీ కళాశాలలు
– అర్హత లేకున్నా మంజూరు చేయించిన వైనం
– యూనివర్సిటీ పేర్కొన్న చోట ఓ కాలేజీ లేనేలేదు
– ‘అవగాహన ఒప్పందం’తో ముందుకు
 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి
తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి విశిష్టమైన పేరు ప్రతిష్టలున్నాయి. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగి, వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన గొప్పవారిని తీర్చిదిద్దిన విశాలమైన శారదా నిలయమిది. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన సమున్నత రాజకీయ శిక్షణాశాల కూడా. వీరు కాక మరెంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, సాహిత్య కోవిదులతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను పరిచయం చేసిన వర్సిటీ ఇది. ఇంతటి పేరున్న యూనివర్సిటీ ప్రాభవం నేడు మసకబారుతోంది. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది. పలు విభాగాల్లో నెలకొన్న తీవ్రమైన నిర్లక్ష్యం వర్సిటీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వసతులు కనుమరుగవుతున్నాయి. దీంతో ఏయేటికాయేడు వర్సిటీ అడ్మిషన్లు తగ్గుతున్నాయి. ఎస్వీయూలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగమే ఇందుకు ఉదాహరణ. ఈ విభాగాన్నీ, ఇక్కడున్న విద్యార్థులను దగ్గరగా పరిశీలిస్తే నోరు తెరవాల్సిందే. ఎవర్ని పలకరించినా ఆశ్చర్యం కలిగించే ఆసక్తికర విషయాలు చెవుల్లో గంట కొడతాయి. కళ్లు విప్పార్చి ఔనా !! అనాల్సిందే మరి. 
అక్రమార్జనలో వీరి రూటు సప‘రేటు’
సంపాదనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్‌. కొందరు వ్యాపారం చేసి, మరికొందరు ఉద్యోగం చేసి...ఇంకొందరు తెలివి తేటలను ఉపయోగించి. కానీ....వర్సిటీలోని కొందరు టీచింగ్‌ స్టాఫ్‌ అడ్డదారిలో రెండు చేతులా సంపాదిస్తున్నారు. వసూల్‌ రాజాలుగా మారి విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్నారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై ఇటీవల బోలెడన్ని ఆరోపణలు హల్‌చల్‌ చేశాయి. వీరిపైనా ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలు కూడా విద్యార్థులు, అధ్యాపకవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక్కడున్న ఆరోపణలను ఒక్కొక్కదాన్నీ విశ్లేషిస్తే.....
వర్సిటీ పరిధిలోని ఐదు బీపీఈడీ కాలేజీలకు సరైన అర్హతలు లేకున్నా వర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏడాది కిందట అనుమతులు మంజూరు చేయించారు. ఓ బీపీఈడీ కళాశాల దరఖాస్తులో పేర్కొన్న చోటలేనే లేదు. దీంతో ఆ కళాశాల యాజమాన్యంతో సరైన ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకున్న వీరిద్దరూ తమకు అనుకూలమైన మరో కాలేజీలో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించేలా సాయమందించారు. 2014–15 సంవత్సరంలో ఏస్వీయూ పరిధిలోని ఐదు బీపీఈడీ కాలేజీల్లో మొదటి రెండు సెమిస్టర్లు జరిగాయి. ఒక్కొక్క సెమిస్టర్‌లో 3 థియరీ, 2 ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించారు. ఎస్వీయూ బీపీఈడీ మినహా మిగిలిన నాలుగు కాలేజీలకూ ఎక్సటర్నల్‌ ఎగ్జామినర్లుగా వీరిద్దరే వెళ్లి, ఆ తర్వాత ఆయా కాలేజీలకు చెందిన 3 వేల సమాధాన పత్రాలను వీరే దిద్దారు. అప్పట్లో 300 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేల చొప్పున సంభావన పుచ్చుకుని వీరందర్నీ పాస్‌ చేయించారన్న ఆరోపణలు ఇటీవల తెరమీదకొచ్చాయి. అప్పట్లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌గా ఉన్నవాళ్లు పేపర్‌ కరెక్షన్లు ఎలా చేస్తారన్నది ప్రశ్న. 
విచారణ జాడేలేదు..
 మరో ముఖ్యమైన విషయమేమంటే... 2014లో ఓ విద్యార్థిని ఎంఫిల్‌ రెగ్యులర్‌ స్కాలర్‌గా ఎస్వీయూలో ప్రవేశం పొందింది. ఆ తరువాత రెండ్రోజులకే ఆమె దుబాయ్‌ వెళ్లింది. అయితే ఆ విద్యార్థినికి 2016లో ఎంఫిల్‌ పట్టా ఇచ్చి పీహెచ్‌డీ ప్రవేశాన్ని కల్పించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అక్రమాలు. వీరికంటే ముందు పనిచేసిన ఓ ‘బాబు’ తన ఉద్యోగ కాలమంతా అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు సర్వత్రా గుప్పుమంటున్నాయి. ఈయన ఘన కార్యాలను వివరిస్తూ ఈ మధ్యనే ఓ భారీ కరపత్రం విడుదలైంది. ఇందులో సదరు అధికారి అవినీతి అక్రమాల చిట్టా ఉంది. సమ్మర్‌ క్యాంప్‌ కోసం విడుదలైన సొమ్ము మింగేయడం దగ్గర నుంచి వేలకు వేలు లంచాలుగా తీసుకుని అడ్డదారిలో విద్యార్థులను పాస్‌ చేయించే వరకూ ఆరోపణలున్నాయి. వీటిపై విచారణలే లేకుండా పోయాయి. 
చీకటి గదుల్లో విద్యార్థులు
వర్సిటీ బీపీఈడీ విద్యార్థుల దుస్థితి కడు దయనీయంగా ఉంది. సరైన వసతి సదుపాయాలు లేక వీరు నానా అవస్థలు పడుతున్నారు. ఉండేందుకు సరైన గదులు లేక వంటరూముల్లోనూ గడుపుతున్నారు. బాత్‌రూములు, తాగునీరు, ఫ్యాన్లు లేక నానా ఇక్కట్లకు గురవుతున్నారు. కరెంటు లేని రాత్రుల్లో కాలసర్పాల సాహచర్యంలో దినమొక గండంగా గడుపుతున్నారు. 
వర్సిటీ ఉన్నతాధికారులేం చేస్తున్నట్టు??
వర్సిటీలోని ఓ కీలక విభాగంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అన్నీ తెలిసి మిన్నకుంటున్నారా, లేకపోతే తెలియని పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా వర్సిటీని చక్కదిద్దే బాధ్యత వీరిపైనే ఉంది. 
 
 

Advertisement
Advertisement