హత్యా రాజకీయాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య | Sakshi
Sakshi News home page

హత్యా రాజకీయాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య

Published Wed, Nov 4 2015 1:37 AM

హత్యా రాజకీయాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య - Sakshi

♦ రంగా హత్య కేసులో చంద్రబాబు విచారణ జరిపించుకోవాలి
♦ కాపు నేతల డిమాండ్
♦ ఎన్టీఆర్ మృతికి చంద్రబాబే కారణం: ముద్రగడ
♦ రంగా హత్య కేసులో ఆయన జోక్యం ఉందన్నా ఆశ్చర్యం లేదు
♦ {పత్యేక కమిటీతో విచారణకు బీజేపీ నేత కన్నా డిమాండ్
 
 టీడీపీ పాలనలో లంచగొండితనం పెరిగింది: కావూరి
 
 కిర్లంపూడి: మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యోదంతంలో చంద్రబాబు హస్తం ఉందంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తాను రాసిన పుస్తకంలో వెల్లడించిన నేపథ్యంలో టీడీపీ అధినేతపై కాపు సామాజికవర్గ నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. జోగయ్య రాసిన పుస్తకం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు హత్యా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి. కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

బాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావడమే కాకుండా, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఆయనను చెప్పులతో కొట్టించిన ఘనుడని మండిపడ్డారు. ఎన్టీఆర్ మానసికంగా కృంగిపోయి మృతి చెందడానికి చంద్రబాబే కారకుడన్న విషయం అందరికీ తెలుసన్నారు. అటువంటి బాబుకు వంగవీటి రంగా హత్య కేసులో జోక్యం ఉందన్నా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం గురించి అప్పట్లోనే కాకినాడలో జరిగిన బహిరంగ సభలో చేగొండి హరిరామజోగయ్య చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పలేదన్నారు. బాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, సీబీఐ విచారణ జరిపించుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు. రంగా హత్యానంతర ఘటనల్లో కాపులపై టాడా చట్టాన్ని ప్రయోగించి జైళ్లలో మగ్గేలా చేశారని ఆరోపించారు. 3,100 మంది కాపు కులస్తులపై కేసులను అనంతర కాలంలో సీఎం మర్రి చెన్నారెడ్డి సహకారంతో ఎత్తివేశారని తెలిపారు.

 కాపులు బిచ్చగాళ్లేమీ కాదు
 ‘‘ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిషన్ పేరుతో కాలయాపన చేసేందుకు, మా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం రూ.100 కోట్లతో ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కాపులు బిచ్చగాళ్లేమీ కాదు. ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేవరకూ ఉద్యమం కొనసాగుతుంది.  చేగొండి హరిరామజోగయ్యను ఉద్దేశించి ఒక మాజీ మంత్రి కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, పుస్తకాలు అమ్ముకునే జాతిగా వ్యాఖ్యానించడం బాధాకరం. కాపులు నిరుపేదలు కాబట్టే వారిని బీసీల్లో చేర్చాలి.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి కమిషన్ లేకుండానే కాపులను బీసీ జాబితాలో చేర్చారు. ఏపీలో చంద్రబాబు మాత్రం కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే జనవరి నెలాఖరులో నిర్వహించే కాపుల బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసి, పోరాటం కొనసాగిస్తాం’’ అని ముద్రగడ హెచ్చరించారు. కాగా వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు పాత్ర ఉందంటూ జోగయ్య పుస్తకంలో ప్రస్తావించిన అంశంపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.

Advertisement
Advertisement