సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేయండి | Sakshi
Sakshi News home page

సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేయండి

Published Thu, Mar 2 2017 10:07 PM

సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేయండి - Sakshi

- ప్రజాభిప్రాయ సేకరణలో
   నేతలు, ప్రజా సంఘాలు, వినియోగదారులు
– ఆమోదయోగ్యకరమైన నిర్ణయం ఉంటుంది
- ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ జి.భవానీ ప్రసాద్‌
 
కర్నూలు (రాజ్‌విహార్‌): విద్యుత్‌ చార్జీలు పెంచితే అన్ని వర్గాల ప్రజలపై దాని ప్రభావం ఉంటుందని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు, వినియోగదారులు స్పష్టం చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు దక్షిణ మధ్య విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌వై దొర నివేదికలపై గురువారం స్థానిక విద్యుత్‌ భవన్‌లో ఏపీ ఈఆర్‌సీ బృందం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ భవానీప్రసాద్‌ అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడేళ్లగా జిల్లాలో కరువు తాండవం చేస్తోందని, అలాంటప్పుడు ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం వేయడం అన్యాయమన్నారు. కరువు జిల్లా కావడంతో విద్యుత్‌ను ప్రత్యేక రాయితీతో సరఫరా చేయాలని కోరారు. వినియోగదారుల అభ్యంతరాలు విన్న డిస్కం సీఎండీ హెచ్‌వై దొర చార్జీల పెంచేందుకు గల కారణాలను వివరించారు. సమస్యలను పరిష్కరిస్తామని, సేవలను మెరుగుపరుస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఈఆర్‌సీ సభ్యులు పి.రామమోహన్, డాక్టర్‌ పి. రఘు, కమిషన్‌ సెక్రటరీ ఎ. శ్రీనివాస్, డిస్కం డైరెక్టర్లు సయ్యద్‌ బిలాల్‌ బాషా, పి.పుల్లారెడ్డి, కర్నూలు జోన్‌ సీఈ పీరయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల ఎస్‌ఈలు పాల్గొన్నారు. 
 
బాబుకు విదేశీ కంపెనీలే అక్కర: సత్యం గౌడు, ఏపీ గ్రానైట్స్, చిన్న తరహా పరిశ్రమల అసోసియేషన్‌ చైర్మన్‌
రాజధానిలో ఏ పని చేపట్టాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విదేశీ కంపెనీలే గుర్తుకొస్తున్నాయి. మన పరిశ్రమల బాగోలు పట్టడం లేదు. నష్టాల కారణంగా సగానికి పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ పరిస్థితుల్లో చార్జీలు పెంచితే ఉన్నవి కూడా మూసేసుకోవాల్సి వస్తుంది. 
 
రాయితీపై విద్యుత్‌ ఇవ్వాలి: ఇ.పుల్లారెడ్డి, సీసీఎం మాజీ కార్పొరేటర్‌
వెనకబడిన సీమలోని జిల్లా అయిన కర్నూలుకు రాయితీతో విద్యుత్‌ను సరఫరా చేయాలి. ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.2వేల కోట్లు, బడాబాబుల బకాయిలు రూ.వెయ్యి కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని వసూలు చేస్తే సంస్థ నష్టాలు తగ్గుతాయి. కనెక‌్షన్‌ కోసం నాలుగేళ్లు నిరీక్షించిన రైతులు చివరకు మరణించినా కనెక‌్షన్‌ ఇవ్వలేదు.
 
 
మామూళ్లతో వేధిస్తున్నారు: వి.భరత్‌ కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
విద్యుత్‌ కనెక‌్షన్లతోపాటు వివిధ రకాల పనుల కోసం వచ్చే రైతులను అధికారులు, సిబ్బంది మామూళ్ల కోసం వేధిస్తున్నారు. నెలల పాటు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కరెంటు సౌకర్యం అందక రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారు. ఇక ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనెక‌్షన్లు తొలగిస్తున్నారు.
 
అందరిపై భారం పడుతుంది: ఎంఏ హఫీజ్‌ ఖాన్, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త
విద్యుత్‌ చార్జీల ప్రభావం అందరిపై పడుతుంది. వర్షాలు లేక రైతులకు పంట చేతికి రావడం లేదు. అలాంటప్పుడు చార్జీలు పెంచితే బిల్లులు ఎలా చెల్లిస్తారు. వీరి చేతిలో డబ్బులేని పక్షంలో పట్టణాలకు వచ్చి లావాదేవీలు కొనసాగించలేదు. వ్యాపారాలు లేక వ్యాపారులు బిల్లులు చెల్లించలేరు. ఒక వేళ చెల్లించాల్సి వస్తే రైతులకు అమ్మే వస్తువుల ధర పెంచాల్సి వస్తుంది.  
 
చిన్న పరిశ్రమలు మూత పడతాయి: ఆర్‌.రఘురామన్, బలహార్‌ కెమికల్స్‌ చైర్మన్‌
చిన్న పరిశ్రమలు అసలే నష్టాల్లో నడుస్తున్నాయి. ఇప్పటికే అనేక పరిశ్రలు వ్యాపారాలు లేక, వివిధ నష్టాల కారణంగా మూత పడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.8వరకు పడుతోంది. మరింత చార్జీలు పెంచితే ఎలా. ప్రస్తుతం పరిశ్రమలు నడుపుకోకపోయినా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. 
 

Advertisement
Advertisement