రిజిస్ట్రేషన్లకూ ఎలక్ట్రానిక్ సంతకం | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లకూ ఎలక్ట్రానిక్ సంతకం

Published Mon, Dec 28 2015 2:13 AM

రిజిస్ట్రేషన్లకూ ఎలక్ట్రానిక్ సంతకం

దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యానికి ఇకపై చెక్

 సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఏర్పడుతోన్న జాప్యాన్ని నివారించేందుకు స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల విభాగం కొత్త ఆలోచన చేస్తోంది.  రిజిస్ట్రేషన్ సందర్భంగా క్రయ, విక్రయదారుల పొటోలను తీసుకునే సమయంలోనే వారితో ఎలక్ట్రానిక్ పాడ్‌పై సంతకాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కో రిజిస్ట్రేషన్‌కు పట్టే సమయంలో కనీసంగా 20 నుంచి 30 నిమిషాల జాప్యాన్ని నివారించొచ్చు. ముఖ్యంగా నగర పరిధిలో రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పద్ధతిని అవలంభిస్తే వినియోగదారులకు వేగంగా పనవుతుందని సబ్ రిజిస్ట్రార్లు అంటున్నారు.

సబ్  రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకొన్న ఇంటర్నెట్ సమస్యల కారణంగా ప్రస్తుతం ఒక్కో దస్తావేజును స్కాన్ చేసి అప్‌లోడ్ చేసేందుకు అరగంట నుంచి గంటకుపైగా సమయం పడుతోందని.. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే దస్తావేజుల వెనుకవైపు క్రయ విక్రయదారులు సంతకం చేయాల్సి ఉన్నందున వారికి నిరీక్షణ తప్పడం లేదంటున్నారు. ప్రస్తుతం రవాణా శాఖలో డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ,  వాహనాల రిజిస్ట్రేషన్ నిమిత్తం వినియోగదారుల నుంచి ఎలక్ట్రానిక్ పాడ్‌లపై సంతకాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ విధానాన్నే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఎలక్ట్రానిక్ సంతకాలకు చట్టబద్ధత లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. కోర్టు కేసుల్లో దస్తావేజులపై ఉన్న ఎలక్ట్రానిక్ సంతకాలను న్యాయమూర్తులు ఏ మేరకు అంగీకరిస్తారన్నదానిపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది.

 సబ్ రిజిస్ట్రార్లకు బయోమెట్రిక్ విధానం
 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ లేకున్నా  సిబ్బంది రిజిస్ట్రేషన్ తంతును పూర్తి చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు తీరిగ్గా ఆఫీసులకు వచ్చి అప్పటికే సిద్ధంగా ఉన్న దస్తావేజులపై చూసీ చూడకుండా సంతకాలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలోనే.. దస్తావేజులపై సబ్ రిజిస్ట్రార్ సంతకం చేసే సమయంలో బయోమెట్రిక్ యంత్రంపై వేలుముద్ర వేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ బయోమెట్రిక్ విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వినియోగదారుల గుర్తింపులో ఆధార్‌ను వినియోగించుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement