వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా | Sakshi
Sakshi News home page

వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

Published Mon, Sep 26 2016 9:13 PM

వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

మిర్యాలగూడ టౌన్‌ : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను చెల్లించడంలో అధికారులు, పాలక మండలి నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయానికి కార్మికులు తాళం వేశారు. అధికారులు, సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లకుండా సుమారు 4 గంటల పాటు అడ్డుకోగా చెట్ల కిందనే ఉద్యోగులు కూర్చున్నారు. కాగా కార్మికులు చేపట్టిన ఆందోళనకు సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఎం, సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గత 7 నెలలుగా కార్మికులకు వేతనాలను కాంట్రాక్టర్‌ ఇవ్వకపోవడంతో అప్పులను తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారన్నారు. కార్మికుల వేతనాల విషయంపై రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీతో పాటు మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు జిల్లా కలెక్టర్‌ల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. వెంటనే కార్మికులకు వేతనాలను చెల్లించాలని చెప్పినప్పటికి అధికారులు, పాలక మండలి కార్మికుల వేతనాలను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.  ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ సీ. సత్యబాబు మాట్లాడుతూ కార్మికుల వేతనాలపై ఉన్నతాధికారులకు నివేదికను అందజేశామన్నారు. ప్రస్తుతం ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలను ఇస్తామన్నారు. దసరా పండుగ వరకు ఐదు నెలల వేతనాలను చెల్లించేందుకు అధికారుల నుంచి అనుమతి రాగానే తక్షణమే చెల్లిస్తామని అన్నారు. దీంతో కార్మికులు ఆందోళనను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, కాంగ్రెస్, సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ నాయకులు డబ్బీకార్‌ మల్లేష్, ధీరావత్‌ స్కైలాబ్‌నాయక్, పగిడి రామలింగయ్య, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్‌యాదవ్, మల్లు గౌతమ్‌రెడ్డి, ఖరీం, శిరసనగండ్ల ఈశ్వరాచారి, మహ్మద్‌బిన్‌ సయ్యద్, రాంమూర్తి, సత్యనారాయణరావు, సోమయ్య, ఎం, రవినాయక్, రాధాకృష్ణ, వహిద్‌ తదితరులున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement