‘ఉపాధి’ కరువు | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కరువు

Published Sun, Feb 5 2017 10:34 PM

‘ఉపాధి’ కరువు

- పనుల్లేక వలస వెళ్తున్న కూలీలు
- స్పందించని అధికారులు
- పూటగడవకు పేదల అవస్థలు
 
 
====================
జిల్లాలో ఉపాధి కూలీలు: 5.26 లక్షల మంది
పనులకు వెళ్తున్న వారు: 27,320 మంది
====================
కోవెలకుంట్ల/ఉయ్యాలవాడ
వలసలు నివారించేందుకు ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో డిసెంబర్‌ నెల నుంచి కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చాయి. అయితే ఆచరణలో అది సాధ్యం కావడంలేదు. సంబంధిత అధికారులు గ్రామాల్లో ఉపాధి పనుల కల్పనపై కూలీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేకపోతున్నారు. జిల్లాలో 2.88 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. 5.26 లక్షల మంది ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు  27,320 మంది కూలీలకు మాత్రమే పనులు కల్పించారు. వీరిలో ఆదోని మండలంలో అత్యధికంగా 2,531 మంది కూలీలు ఉన్నారు. అతి తక్కువగా వెలుగోడు మండలంలో 18 మందికి మాత్రమే పని కల్పించారు. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండలంలో 135 మంది, అవుకు మండలంలో 530 మంది, కొలిమిగుండ్ల మండలంలో 535 మంది, సంజామల మండలంలో 79 మంది పనులకు వెళ్తున్నారు. బండిఆత్మకూరు మండలంలో 42 మంది పనులకు వెళుతున్నట్లు రికార్డుల్లో నమోదైంది.
వ్యవసాయ పనులకు వలస..
ఉన్న ఊరిలో ఉపాధి కరువవడంతో దూర ప్రాంతాలకు కూలీలు వలస వెళ్తున్నారు. సంజామల మండలంలో పప్పుశనగ, జొన్న కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట, గొర్విమానుపల్లె, ఎర్రగుడి అలాగే కర్నూలు, గోనెగండ్ల,  ఆదోని ప్రాంతాల నుంచి వందలాది మంది కూలీలు ఇక్కడి వచ్చి పనులు చేస్తున్నారు. దొర్నిపాడు మండలంలో మిరప కోత పనులు అధికంగా ఉండటంతో కోవెలకుంట్ల, బనగానపల్లె తదితర మండలాల నుంచి ఆటోల్లో వలస వచ్చి కూలీలు పనులు చేస్తున్నారు.
అధికారుల వైఫల్యం..
ఉపాధి పథకం కింద పనుల కల్పించడమే కాకుండా వేసవి అలవెన్స్‌ ద్వారా కూలి మొత్తంలో ఫిబ్రవరి నెల నుంచి 20 శాతం అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కూలీలకు ఉపాధి పథకంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉన్నా.. అధికారులు ఆ దిశగా కృషి చేయడం లేదు. జిల్లాలో మరికొంత మంది కూలీలు మిరప కోతలు, వాణిజ్య పనుల నిమిత్తం గుంటూరుకు వలస వెళ్తున్నారు.  
 
పూటగడిచేదెట్టా :  కంబయ్య, నర్సిపల్లె, ఉయ్యాలవాడ మండలం
వ్యవసాయ పనులు ముగిశాయి. కరువు పనుల్లేవు. మేము ఎలా బతకాలి. పనులు చూపిస్తే  చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.  అధికారులు స్పందించి కూలీలను ఆదుకోవాలి.
 
ప్రభుత్వం ఆదుకోవాలి: మాబుసాని, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం
ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు, ప్రజల అనుకూలంగా ఉండే పనులు చేపట్టాలి. జాబ్‌కార్డులు కలిగిన కూలీలందరికీ పనులు ఇవ్వాలి. వేసవి కాలంలో పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. 
 
అందరికీ పనులు కల్పిస్తాం: మహేష్‌కుమార్, ఎంపిడిఓ, ఉయ్యాలవాడ
వచ్చే వారం నుంచి ఉపాధి పథకం ద్వారా శ్రమశక్తి సంఘాల్లో ఉన్న కూలీలందరికీ పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే పనులు ప్రారంభిస్తే కూలీలతో సమస్య ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement