మళ్లీ బ్రేక్‌!

23 Mar, 2017 16:50 IST|Sakshi
మళ్లీ బ్రేక్‌!

► ఖజానాలో కదలని బిల్లులు
► స్తంభించిన ఆన్‌లైన్‌ సేవలు
► పది రోజులుగా కొనసాగుతున్న ఆంక్షలు
► బిల్లులు డ్రా చేసుకోవాలనుకునే వారికి నిరాశే
► ఉద్యోగుల జీతాలకూ లభించని అనుమతి
► ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు


జిల్లా ఖజానాశాఖలో మళ్లీ బిల్లులకు బ్రేక్‌ పడింది. ఆన్‌లైన్‌ సేవలు సైతం స్తంభించడంతో గత పది రోజులుగా బిల్లులకు మోక్షం లభించడం లేదు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చే సమయంలో ఖజానాపై ఆంక్షలు విధించడం బిల్లులు పెట్టుకున్న వారిలో ఆందోళనకు కారణమవుతోంది.

ఒంగోలు టూటౌన్‌ : జిల్లా సబ్‌ ట్రెజరీ కార్యాలయ పరిధిలోనే వందల సంఖ్యలో బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. చివరి త్రైమాసికం బడ్జెట్‌ నుంచి బిల్లులు డ్రా చేసుకోవాలని హడావుడి పడే వారికి నిరాశే మిగిలింది. గత ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి ఖజానాపై రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు గా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. దీంతో అన్ని రకాల బిల్లులు నిలిచిపోతున్నాయి. దాదాపు నాలుగో త్రైమాసికంలో సుమారుగా రూ.500 కోట్ల వరకు అయ్యే బిల్లులు ఆగిపోయి ఉంటాయని అంచనా.ఇటీవల జిల్లాకు వచ్చిన ట్రెజరీ శాఖ స్టేట్‌ అడిషనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బి.ఎల్‌.హనుమంతరావు ట్రెజరీ ఆంక్షలు ప్రభుత్వం ఎత్తివేసినట్లు విలేకర్ల సమావేశంలో తెలిపారు. దాంతో దాదాపు 482 బిల్లులకు ఒక్క సారిగా మోక్షం లభించింది. వీటిలో అన్ని ప్రభుత్వం కార్యాలయాల కంటిన్‌జెంట్‌ బిల్లులు ఉన్నాయి. ముఖ్యంగా  కళాశాలలో చదువుతున్న విద్యార్థుల (పెండింగ్‌ బకాయిలు) ఉపకార వేతనాలను పూర్తిగా క్లియర్‌ చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్ల బకాయిలను విడుదల చేసింది. వీటిలో ప్రకాశం జిల్లావే రూ.55 కోట్లు ఉన్నాయి.  

ఈనెల 13 నుంచి కదలని బిల్లులు.: ప్రభుత్వం ఉన్న ఆర్థిక వనరులను మలచుకొని పెండింగ్‌ బకాయిలను విడుదల చేసినట్లు ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఖజానాశాఖలో బిల్లులు నిలిచిపోయినట్లు వివరించారు. పాన్‌ నంబర్‌ లేని పలు పార్టీలు, సంస్థలు ఇతర బిల్లులను ఆదాయపన్ను శాఖ తీవ్రంగా చూడటం వలన చెల్లింపుల్లో కొంత ఆలస్యమయినట్లు తెలిపారు. మళ్లీ ఈ నెల 13వ తేదీ నుంచి ఖజానా బిల్లులు నిలిచిపోయాయి. దాదాపు 10 రోజులుగా నాలుగో త్రైమాసికం బిల్లులు నిలిచిపోవడంతో సంబంధిత వర్గాలు చెందుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి పోతున్నా.. ఇంతవరకు ఖజానా ఆంక్షలు తొలగలేదని ట్రెజరీ వర్గాలు తెలిపాయి.

నిధులుండీ నిష్ప్రయోజనం..: జిల్లాలో ఒంగోలు, అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, మార్టూరు, పొదిలి, యర్రగొండపాలెంలలో ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 12 ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 37,647 మంది ఉద్యోగులు, 22,250 మంది పెన్షనర్స్‌ ఉన్నారు. వీరందరు ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెల పొందుతుంటారు. ఇవి గాక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఆర్‌అండ్‌బి, దాదాపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఎదురు చూస్తున్నాయి. దీనికి తోడు ఈ నెలాఖరుకు ఖర్చు పెట్టాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి. అందుబాటులో ఉన్న నిధుల్లో 75 శాతం మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన నిధులు వేరే ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పంచాయతీల్లో ఉన్న నిధులు ఖర్చు చేయడానికి లేకుండా పోయింది. ఆర్థిక లోటును అంచనా వేసుకొని, వనరుల లభ్యతను బట్టి ప్రభుత్వం బిల్లులకు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలకు అనుమతి లేని పరిస్థితి నెలకొంది. సర్కార్‌ ఆర్థిక క్రమశిక్షణ వలన అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక  కష్టాలు ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు