అసువులు తీసుకున్న విద్యార్థి | Sakshi
Sakshi News home page

అసువులు తీసుకున్న విద్యార్థి

Published Sat, Sep 2 2017 7:48 AM

అసువులు తీసుకున్న విద్యార్థి - Sakshi

రైలు కదులుతుండగా ప్లాట్‌ఫామ్‌పై నుంచి దూకిన ఇంజనీరింగ్‌ విద్యార్థి
జేబులో దొరికిన సూసైడ్‌ నోటు
ఒక్కగానొక్క కొడుకు మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు


ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఐఏఎస్‌ కావాలని ఆశపడ్డాడు. సెలవులు కావడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికొచ్చాడు. ఏం జరిగిందో ఏమో.. శుక్రవారంరైలుకింద పడి ఆత్మహత్యకుపాల్పడ్డాడు.

గూడూరు: కదులుతున్న  రైలు కింద పడి ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గూడూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. చదువులో చురుకుగా ఉండే ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.  రైల్వే పోలీసులు,  బంధువుల కథనం మేరకు.. వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం వెంకటాపురానికి చెందిన వెంకటశివారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బీ వెంకటశివానందరెడ్డి(22) ప్రొద్దుటూరులో డిప్లమా పూర్తి చేశాడు. అనంతరం విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చేరాడు. ప్రస్తుతం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం విద్యానగర్‌ నుంచి గూడూరు  రైల్వే స్టేషన్‌ చేరుకున్నాడు.

రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆగిఉన్న యశ్వంత్‌ఫూర్‌ నుంచి సబల్‌పూర్‌ వెళ్లే రైలు బయలుదేరగానే ఇంజన్‌ కింద దూకాడు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో రైలును ఆపేశారు. అప్పటికే రైలింజన్‌ చక్రాల కింద నలిగి శివానందరెడ్డి మృతి చెందాడు. దీంతో  జీఆర్‌పీఎఫ్‌ ఎస్సై బాలకృష్ణ, ఆర్పీఎఫ్‌ ఎస్సై గిరయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

దీంతో రైలు అరగంటపాటు ఆలశ్యంగా బయలుదేరి వెళ్లింది. మృతుడి వద్ద ఉన్న ఐడీ కార్డు ద్వారా విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. మృతుడి జేబులో నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు అని ఇంగ్లిష్‌లో రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది. కళాశాల యాజమాన్యం అందించిన సమాచారంతో గూడూరు ఏరియా ఆసత్రికి చేరుకుని కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇంటికెళ్లి వచ్చిన నాలుగురోజులకే..
విద్యానగర్‌లోని ఎన్‌బీకేర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మెకానికల్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న వెంకట శివానందరెడ్డి  వినాయక చవితి సెలవులకు ఈ నెల 24న తన స్వగ్రామమైన వెంకటాపురం వెళ్లాడు. తన తోటి స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపి 28న బయలుదేరి కళాశాలకు వచ్చాడు. ఊరి నుంచి వచ్చిన నాలుగు రోజులకే కొడుకు మృతి చెందడం తల్లిదండ్రులు, సోదరిని కలిచివేసింది.  

ఐఏఎస్‌ కావాలనే కాంక్షతో..
శివానందరెడ్డి చిన్ననాటి నుంచే ఐఏఎస్‌ కావాలనే కాంక్షతో కష్టపడి చదువుతుండేవాడని బంధువులు తెలిపారు. తన పేరుకి చివరన ఐఏఎస్‌ అని సైతం రాసుకునేవాడని బంధువులు, స్నేహితులు కంటతడిపెడుతూ చెప్పారు. కళాశాలలో ఎవరితోనూ వివాదాలు లేవని, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటాడని తెలిపారు. ఎప్పుడూ సెల్‌ఫోన్‌తో గడపడని, గురువారం రాత్రి మాత్రం సెల్‌ఫోన్‌ చూస్తూ ఉన్నాడని స్నేహితులు చెప్పారు.

మృతి చెందిన వెంకట శివానందరెడ్డి
, మృతుడి జేబులో లభించిన సూసైడ్‌  నోట్‌ ,రోదిస్తున్న మృతుడి తల్లిదండ్రులు, సోదరి

Advertisement
Advertisement