జిల్లాకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టండి | Sakshi
Sakshi News home page

జిల్లాకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టండి

Published Thu, Aug 4 2016 11:37 PM

జిల్లాకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టండి - Sakshi

కడప కార్పొరేషన్‌:

వైఎస్‌ఆర్‌ జిల్లాకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్‌ప్రభును కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ  మాట్లాడుతూ  చెన్నై, చిత్తూరు, తిరుపతి నుంచి కర్నూలు, నంద్యాల మీదుగా హైదరాబాద్‌కు  రైళ్లు నడిపితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.  ప్రస్తుతం చిత్తూరు–హైదరాబాద్‌ మీదుగా నడుస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై–హైదరాబాద్‌ మీదుగా నడుస్తున్న ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌లు కడప నుంచి కొండాపురం, తాడిపత్రి, గుంతకల్, కర్నూల్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుతున్నాయన్నారు. కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశపెట్టి చిత్తూరు లేదా చైన్నై నుంచి కడప, నంద్యాల, కర్నూలు మీదుగా హైదరాబాద్‌ వరకూ నడిపితే ప్రయాణికులకు చాలా సౌలభ్యంగా ఉంటుందన్నారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి కోస్తా జిల్లాలకు వెళ్లడానికి ఒక్క రైలు కూడా లేదన్నారు. ప్రస్తుతం ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌ పూర్తయినందున కడప–విజయవాడ కొత్త రైలును ప్రవేశపెట్టి నంద్యాల మీదుగా నడపాలన్నారు.
 గ్రామీణ ప్రాంతాలకు సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాలి
కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ను విస్తరింపజేయాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర కమ్యునికేషన్స్‌ శాఖా మంత్రి మనోజ్‌ సిన్హాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ పులివెందుల మండలంలోని కణంపల్లి, మోట్నూతల పల్లె, వేంపల్లి మండలంలోని గిడ్డంగివారి పల్లె, బక్కన్నగారి పల్లె, లింగాల మండంలోని కోమన్నూతల, ఎగువపల్లి, తాతిరెడ్డిపల్లె, సింహాద్రిపురం మండంలోని సుంకేసుల, రావుల కొలను, అహోబిళ పురం గ్రామాల్లో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ లేక సమాచార లోపంతో అక్కడి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకుపోయారు. నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని చెప్పారు. గతంలో ఈ సమస్యను అప్పటి మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ సమస్యపై సత్వరం చర్యలు తీసుకొని ఆయా గ్రామాలకు సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ కల్పించాలని కోరారు.
 

Advertisement
Advertisement