తిరుమలలో భక్తులను ఇలాగే పిలవాలి.. | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తులను ఇలాగే పిలవాలి..

Published Wed, Sep 16 2015 9:13 PM

తిరుమలలో భక్తులను ఇలాగే పిలవాలి.. - Sakshi

- భక్తులను 'గోవిందా..' అని సంబోధించాలన్న టీటీడీ చైర్మన్, ఈవోలు

తిరుచానూరు :
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను గోవిందా అని సంబోధించాలని టీటీడీ చెర్మైన్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీవారి సేవకులకు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి 2,750మంది శ్రీవారి సేవకులు, 600మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చారు. భక్తులతో ఎలా వ్యవహరించాలి, సేవలు ఎలా అందించాలి వంటి వాటిపై బుధవారం తిరుమల ఆస్థానమండపంలో వీరికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెర్మైన్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి నిస్వార్థ సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల జన్మ ధన్యమని తెలిపారు.

15ఏళ్ళ క్రితం 195మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవలో ఇప్పటి వరకు సుమారు 6.38లక్షల మంది సేవలందించారని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరగాలని కోరారు. భక్తుల మన్ననలు పొందేలా సేవలందించాలని కోరారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సేవలందించడం శ్రీవారి సేవకుల పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అనంతరం ఈవో డాక్టర్ డి.సాంబశివరావు మాట్లాడుతూ ధర్మప్రచారానికి రథసారధులు శ్రీవారి సేవకులని తెలిపారు. తిరుమలలో సేవా విధులతో పాటు ధర్మప్రచారంలో భాగంగా నిర్వహించే మనగుడి, శుభప్రదం, రథయాత్రలు, శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు, గోపూజ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీవారి సేవకులను కోరారు.

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందుతున్న సేవలపై శ్రీవారి సేవకులతో సర్వేలు నిర్వహించి, లోపాలున్న చోట నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల దళారి వ్యవస్థను అరికట్టేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల 5లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద శ్రీవారి సేవకులు సేవలందించారని, వారి సేవలకు విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ శశిధర్, డీపీపీ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, టీటీడీ విద్యాశాఖాధికారి విజయకుమార్, పీఆర్వో టి.రవి, ఏపీఆర్వో పి.నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement