ఎర్రవల్లి పిలుస్తోంది! | Sakshi
Sakshi News home page

ఎర్రవల్లి పిలుస్తోంది!

Published Wed, Dec 23 2015 6:29 AM

ఎర్రవల్లి పిలుస్తోంది! - Sakshi

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న కుగ్రామం
* అయుత చండీయాగంతో చుట్టుపక్కల ఊళ్లకూ కొత్త వెలుగులు
* మెరిసిపోతున్న రహదారులు.. మురిసిపోతున్న పల్లె ప్రజలు
* అంగరంగ వైభవంగా ఏర్పాట్లు.. విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్న యాగక్షేత్రం

 
 అయుత చండీయాగశాల నుంచి సాక్షి ప్రతినిధి:
 కంకర తేలిన రోడ్లు.. తాగునీళ్లకు తండ్లాట.. గుడిసెల్లో బతుకులు.. పొద్దుగూకితే ఇళ్లల్లో అలుముకునే చీకట్లు.. ఊళ్లో ఏమైనా అయితే పక్కపల్లెకు తెలియనంత కుగ్రామం అది! మెదక్, నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో విసిరేసినట్టున్న ఆ గ్రామం ఇప్పుడు రాష్ట్రానికే కాదు.. దేశంలోని పల్లెలకే ఆదర్శం. అదే జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి! సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌తో వార్తల్లోకి ఎక్కిన ఈ గ్రామం ఇప్పుడు అయుత చండీయాగంతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

 యాగశాల దారిలో..: హైదరాబాద్ నుంచి శామీర్‌పేట మీదుగా రాజీవ్ రహదారిపై కరీంనగర్ వైపు 56 కిలోమీటర్లు ప్రయాణిస్తే గౌరారం గ్రామం వస్తుంది. అక్కడ ఆగి కుడి వైపునకు చూస్తే ‘చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పురశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం’ అని రాసిన నిలువెత్తు స్వాగత ద్వారాలు యాగశాలకు దారి చూపిస్తున్నాయి. 33 అడుగుల డ బుల్ లైన్ రోడ్డు నల్లగా మెరుస్తోంది. ఇంతకుముందు ఇక్కడ ప్యాచ్‌లు వేసిన 10 అడుగుల సింగిల్ రోడ్డు ఉండేది. యాగం కోసం వారం కిందటే డబుల్ లైన్ రోడ్డు వేశారు. గౌరారం నుంచి వర్థరాజ్‌పూర్ వరకు రూ.17 కోట్లు ఖర్చు చేసి 12.5 కిలోమీటర్ల మేర ఈ దారి వేశారు. రోడ్లు, భవనాల శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 45 రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేశారని చెబుతున్నారు. గౌరారం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న దాబాలు కూడా ముస్తాబయ్యాయి. కొత్త ఫర్నిచర్, కొత్త ధరల పట్టికతో సిద్ధమయ్యాయి.

తినటం మానేస్తామా సార్..
 గౌరారం మీదుగా 3 కిలోమీటర్లు  ముందుకు వెళ్తే పాములపర్తి ఊరు. ఈ ఊరిపై యాగం ప్రభావం పెద్దగా కనిపించ లేదు. చేనులో పత్తి ఏరుకునే కొందరు కూలీలను పలకరించగా.. ‘‘యాగం ఉందని తినటం మానేస్తమా సారూ.. యాగానికి పోతే ఇళ్లెట్ల గడవాలే’’ అని వారన్నారు. యాగశాల వైపు బయల్దేరితే మార్కుక్ గ్రామం వచ్చింది. సీఎం ఫాంహౌస్‌కు వెళ్లే సమయంలో ఇక్కడ ఆగి మాట్లాడుతూ... ‘‘వెయ్యి ఎకరాల సాగు ఉన్న గ్రామమట. సారవంతమైన భూముల్లో కూరగాయలు పండుతాయట. చిన్న సన్నకారు రైతులు బోర్లు వేసుకున్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదు’’ అని మార్కుక్‌ను ఉద్దేశించి ఒకట్రెండు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇక అక్కడ్నుంచి కిలోమీటర్ దూరం నడిస్తే..  గంగాపూర్ చౌరస్తా. ఇక్కడ కుడి, ఎడమలుగా రెండు దార్లు వెళ్తాయి. కుడివైపు దారిని వీవీఐపీలు, వీఐపీలకు కేటాయించారు. సామాన్యులకు ఈ దారిగుండా అనుమతి లేదు. గంగాపూర్ చౌరస్తా నుంచి యాగస్థలం వరకు ప్రతి స్తంబానికి హైమాస్టు లైట్లు పెట్టారు. ఎడమ వైపు దారిలో సామాన్య భక్తులకు, వివిధ గ్రామాల నుండి వచ్చే నాయకులకు, సర్పంచ్‌లు, ఎంసీటీసీలకు కేటాయించారు.

దేదీప్యమానంగా యాగస్థలి
 గంగాపూర్ శివారులో మేకలు చూసుకుంటున్న అబ్బసాని మల్లయ్య యాదవ్‌ను ‘తాత యాగం ఎట్టున్నదే..’ అని పలకరించగా.. ‘కాలం బోయింది బిడ్డా... నా సిన్నప్పుడు ఇంత సౌలతి ఎక్కడిది. రోడ్డు జూస్తివా... ఎట్టేసిండ్రో... పోచమ్మ తల్లికి ఏటపోతును కోస్తేనే పెద్ద పండుగ అనుకునేటోళ్లం. ఇంత పెద్ద యాగం ఉంటదని నాకు తెల్వను కూడా తెల్వదు. కేసీఆర్ పెద్దోడు కాబట్టి జోరుగ జేస్తండు. ఎట్టాజేసినా గ దే పుణ్టెం (పుణ్యం) కద బిడ్డా...’ అంటూ వేదాంతం చెప్పాడు. ఈ చౌరస్తా నుంచి శివారు వెంకటాపూర్ వరకు ప్రతి స్తంబానికి హైమాస్టు లైట్లు బిగించారు. శివారు వెంకటాపూర్ నుంచి యాగస్థలం ఒక కిలోమీటర్ లోపే.

విద్యుత్ దీపాల వెలుగుల్లో యాగస్థలం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అంత వెలుగును చూడటం చుట్టు పక్కల పల్లె ప్రజలకు అదే మొదటిసారి అట. ‘ఆ లైట్లను జూత్తంటే పట్నంల ఉన్నట్టే ఉంది సారూ..’ అంటూ యాదమ్మ అనే మహిళ సంబరపడిపోయింది. పొలం పనులు చేసుకొని ఇళ్లకు వెళ్తున్న శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన మూనగారి లక్ష్మి, గాలవ్వలను పలకరించగా.. ‘సీఎం సారు.. మా ఊరు నుంచే వత్తాపోతా ఉంటడు గానీ ఊళ్లె దిగకపాయే. యాగం పెడితే మంచిదేగా సారూ..’ అని అన్నారు. యాగానికి మీరు వస్తారా? అని అడగ్గా.. ‘తీరుబాటు ఉంటే అత్తాం.. లేకుంటే లేదు..’ అని సమాధానమిచ్చారు. శివారు వెంకటాపూర్ చౌరస్తా వద్ద 5 హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. రోడ్డు ఎడమ వైపు ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి గవర్నర్‌కు, మరొకటి ఏపీ సీఎం చంధ్రబాబునాయుడుకు కేటాయించారు.  కుడివైపున రాష్ట్రపతి కోసం మరో హెలిప్యాడ్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.

కరీంనగర్ నుంచి ఇలా రావాలి..
 కరీంనగర్ నుంచి వచ్చేవారి కోసం ప్రజ్ఞాపూర్ వద్ద యాగం స్వాగత ద్వారాలు  ఏర్పాటు చేశారు. ప్రజ్ఞాపూర్ నుంచి ఎర్రవల్లి యాగశాల 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ్నుంచి 7 కిలో మీటర్లు ప్రయాణిస్తే గణేష్‌పల్లి చౌరస్తా. అక్కడ చరణ్ అనే యువకుడిని పలకరించగా.. ‘‘కేసీఆర్ గొప్పోడు సార్.. ఇంత పెద్దయాగం చేస్తుండు. ఎర్రవల్లికే కాదు సార్.. చుట్టుపక్కల మా ఊళ్లకు కూడా పేరొచ్చింది.. యాగం కోసం నెల నుంచి రోడ్డు వేస్తున్నరు కదా. భోజనాలు, టిఫిన్లు, ఛాయ్ బాగా పోతున్నాయి సార్..’’ అంటూ మురిసిపోయాడు. ఖమ్మం, నల్లగొండ నుంచి వచ్చే భక్తులు గ ణేష్‌పల్లి చౌరస్తాకు చేరుకున్న తర్వాత కుడివైపు మళ్లితే నర్సన్నపేట క్రాస్ వస్తుంది. కరీంనగర్, వరంగల్ భక్తులు కూడా ఇదే దారిన రావాలి. హైదరాబాద్ కుషాయిగూడ నుంచి వచ్చే వారికి కూడా ఒక దారి ఉంది. వాళ్లు లక్ష్మాపూర్, కర్కపట్ల, దామరకుంట, వర్ధరాజ్‌పూర్ మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి ఎర్రవల్లి యాగ స్థలానికి చేరుకోచ్చు. యాగానికి 20 కిలోమీటర్ల దూరం నుంచే ప్రతి గ్రామ శివారులో ఒక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ప్రతి చెక్ పోస్టు వద్ద  6 మంది పోలీసులను కాపలా పెట్టారు.

ఎర్రవల్లి దశ తిరిగింది..
 ఎర్రవల్లి 420 కుటుంబాలున్న చిన్న పల్లె. 2,200 ఎకరాల సాగు భూమి ఉంది. పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలు. కేసీఆర్ రాకముందు ఈ పల్లెను పట్టించుకున్నవారు లేరు. కేసీఆర్ క్లాస్‌మేట్ జహంగీర్ పట్టుబట్టి ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భూమి కొనుగోలు చేయించారట. అప్పట్నుంచే ఊరు దశ తిరిగింది. తెలంగాణ రావడం.. కేసీఆర్ సీఎం కావడం గ్రామాభివృద్ధికి మరింత బలం చేకూరింది. సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 285 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రతి రైతుకు డ్రిప్పులు అందిస్తున్నారు. గ్రామస్తులను పలకరిస్తే.. ‘మా బతుకులకు ఢోకా లేదండీ.. కేసీఆర్ అన్నీ ఇస్తున్నారు. ఈ యాగంతో మా యోగం మారిపోద్ది..’ అని మురిసిపోయారు.

భారీ పోలీస్ బందోబస్తు
 ఐదు రోజలు జరిగే ఈ అయుత చండీయాగానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సుమతి, ఆరుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 185 మంది ఎస్సైలు, 40 మంది మహిళ ఎస్సైలు, 300 మంది ఏఎస్సైలు, 200 మంది హోంగార్డులు, 400 మంది కేంద్ర భద్రత బలగాలలతో పాటు ఆదనంగా 400 మందిని కానిస్టేబుళ్లలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement