ఇంకెనాళ్లీ నిరీక్షణ | Sakshi
Sakshi News home page

ఇంకెనాళ్లీ నిరీక్షణ

Published Sun, Jan 8 2017 10:09 PM

ఇంకెనాళ్లీ నిరీక్షణ

- క్షయ నివారణ సొసైటీలో భర్తీకి నోచుకోని 20 పోస్టులు
అనంతపురం మెడికల్‌ : ఏ శాఖలో అయినా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తే వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసి పరిపాలన సజావుగా సాగాలని భావిస్తారు. కానీ వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నోటిఫికేషన్‌ ఇచ్చారు.. దరఖాస్తులు అందాయి.. స్క్రూటినీ కూడా పూర్తయింది.. కానీ మెరిట్‌ జాబితా విడుదల చేయడంలో అంతులేని జాప్యం చేస్తున్నారు. జిల్లా క్షయ వ్యాధి నివారణ సొసైటీలో 20 పోస్టుల భర్తీకి 2014లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పట్లో దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు... 2016లో అప్పటి నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నోటిఫికేషన్‌ను గత ఏడాది మార్చిలో విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు.

ఒక సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు 8 మంది, ఒక జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌కు 45, ఒక టీబీ కౌన్సిలర్‌కు 42, ఒక టీబీ స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌కు 58 దరఖాస్తులు వచ్చాయి. అలాగే 11 సీనియర్‌ టీబీ సూపర్‌వైజర్‌ పోస్టులకు 138, రెండు టీబీ హెల్త్‌ విజిటర్‌ పోస్టులకు 62, రెండు ల్యాబ్‌ టెక్నీషియన్లకు 93, ఒక అకౌంటెంట్‌కు 18 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 20 పోస్టులకు 464 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగిసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. ప్రాథమికంగా, రెండో సారి కూడా స్క్రూటినీ ముగిసింది. కమిటీ మెరిట్‌ జాబితాను కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది. అయినా ఫైనల్‌ లిస్ట్‌ మాత్రం విడుదల చేయడం లేదు. నెలలు గడుస్తున్నా జాబితాను విడుదల చేయకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు పోస్టులు భర్తీ చేస్తారా, లేక గతంలోలా మళ్లీ బ్రేకులు పడతాయా అనే అనుమానం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు నిత్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పోస్టులు భర్తీ చేస్తే క్షేత్రస్థాయిలో వైద్యసేవలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement