‘సిరిసిల్ల’ శిథిలం..! | Sakshi
Sakshi News home page

‘సిరిసిల్ల’ శిథిలం..!

Published Tue, Aug 15 2017 1:33 AM

‘సిరిసిల్ల’ శిథిలం..!

సిరిసిల్లటౌన్‌: కార్మికక్షేత్రం మరమ్మత్తులో మగ్గుతోంది. జిల్లాకేంద్రంగా ఏర్పడటంతో రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల వేగవంతం అనివార్యమైంది. పట్టణంలో మూడువైపులా ప్రధాన రహదారుల విస్తరణ పనులతో ఎక్కడ చూసినా శిథిలావస్థలో ఉన్న భవనాలే దర్శనమిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు కూల్చివేయడంతో ప్రకృతి వైపరీత్యం ఏర్పడిన పరిస్థితులు కనపడుతున్నాయి. నాలుగు నెలల క్రితం ప్ర ధాన రోడ్లపై ఎటుచూసినా అందమైన భవనా లతో కళకళలాడిన పట్టణం వైభవం.. ఇప్పుడు బోసిపోయి, కళాశిహీనంగా కనిపిస్తోంది.

అభివృద్ది పథంలో పయనం..
జిల్లా కేంద్రంగా ఏర్పడిన సిరిసిల్ల పట్టణం అభివృద్ధి పథంలో పయనిస్తోంది.  కరీంనగర్, హైదరాబాద్, కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారుల విస్తరణ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. కొత్తచెరువు మొదలుకుని కార్గిల్‌లేక్‌ వరకు 100 అడుగులు, అంబేద్కర్‌చౌక్‌ నుంచి విద్యానగర్‌ వరకు 80 ఫీట్ల వరకు రోడ్లు విస్తరిస్తున్నారు. ఇందులో మొత్తంగా 368 భవనాలు తొలగించారు. వీటిలో 354 ప్రైవేటువి కాగా.. 14 ప్రభుత్వ కార్యాలయాల బిల్డింగులు, ప్రహరీలు ఉన్నాయి. విస్తరణ కొలతల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు ఇబ్బంది లేకున్నా ప్రైవేటు ఆస్తులు చాలాదెబ్బతిన్నాయి. వీటిలో కొన్నే పూర్తిగా దెబ్బతినగా చాలా భవనాలు పాక్షికంగా కూల్చేయాల్సి వచ్చింది.

రూ.కోట్లలో ఆస్తి నష్టం..
ప్రభుత్వ కార్యాలయాల భవనాల సంగతి పక్కన పెడితే.. ప్రైవేటు ఆస్తులు  చాలావరకు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డు విస్తరణకు అనుగుణంగా కొనసాగిన కూల్చివేతలో కొన్ని చోట్లలో పురాతన భవనాలు పూర్తిగా కూల్చివేశారు. దీంతో వ్యాపార సంస్థలు, ప్రైవేటు కార్యాలయాల నిర్వహణ, చిరువ్యాపారాలకు బ్రేక్‌పడింది. కొత్తచెరువు నుంచి కార్గిల్‌లేక్, అంబేద్కర్‌చౌక్‌ నుంచి విద్యానరగ్‌ వరకు దాదాపు 368 భవనాలను కూల్చివేయడం ద్వారా రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. వీటిలో సింహభాగం నిబంధనలకు అతీతంగా చేపట్టినవి ఉన్నట్లు సమాచారం. పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంలో మొత్తంగా 354 ప్రైవేటు నివాసాలు కూల్చివేతకు గురికాగా.. అందులో కేవలం 38 మాత్రమే గ్రామపంచాయతీ, మున్సిపల్‌ నిబంధనల ప్రకారం ఉండటం గమనార్హం.

వ్యాపార కూడళ్లలో శరవేగంగా పనులు..
వ్యాపార లావాదేవీలు అధికంగా సాగే పాతబస్టాండ్, కరీంనగర్‌ రోడ్డు, అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, కలెక్టర్‌ ఆఫీసు రోడ్డు వంటి ప్రాంతాల్లో చేపట్టిన విస్తరణ పనుల్లో కూల్చివేసిన భవనాల పునరుద్ధరణ శరవేగంగా సాగుతోంది. గోపాల్‌నగర్, కోర్టుచౌరస్తా, సాయినగర్‌ తదితర ప్రాంతాల్లో వ్యాపారం సాధారణంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో భవనాల పునరుద్ధరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. భవనాల పునరుద్ధరణ ఆర్థిక వ్యవహారంతో కూడినందున, ఏకమొత్తంలో కూలీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో  పనుల్లో జాప్యమవుతోందని స్థానికులు చెబుతున్నారు. తద్వారా సిరిసిల్లకు కొత్తకళ సంతరించుకోవడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement