నకిలీలలు | Sakshi
Sakshi News home page

నకిలీలలు

Published Sun, Sep 11 2016 12:50 AM

నకిలీలలు - Sakshi

 
  • కలిగిరి కేంద్రంగా నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీల తయారీ 
  • అధికారుల సంతకాలు ఫోర్జరీ
  • బ్యాంకు రుణాల కోసం అడ్డదారులు తొక్కుతున్న రైతులు
 
కలిగిరి: నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, 1బీల తయారీకి కలిగిరి మండలం అడ్డాగా మారింది. అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, మీసేవ నిర్వాహకుల సహకారంతో కొందరు పెద్దమొత్తంలో నగదు తీసుకుని నకిలీలను తయారు చేసి ఇస్తున్నారు. కొందరు రైతులు నకిలీల సాయంతో యథేచ్ఛగా బ్యాంకు రుణాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాల్లో పొందే సమయంలో ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్తగా వెబ్‌ల్యాండ్‌లో తాత్కాలికంగా పేర్లు నమోదు చేస్తున్నారు. రుణాలు పొందిన అనంతరం వాటిని తొలగిస్తున్నారు. ఇందుకు  మీసేవ  కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్‌ కార్యాలయ కంప్యూటర్‌ ఆపరేటర్లు సహకరిస్తున్నారు. కలిగిరిలో నకిలీ అడంగల్, 1బీ తయారీకి సహకరించారని కంప్యూటర్‌ ఆపరేటర్, మీసేవ నిర్వాహకునిపై తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. 
వెలుగులోకి వచ్చిన నకిలీ సంఘటనలు 
–గత ఏడాది జూన్‌ 24న కలిగిరిలోని ఏపీజీబీ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీలతో రుణాలు పొందేందుకు నలుగురు రైతులు ప్రయత్నించారు. అప్పటి తహసీల్దార్‌ లావణ్య ఫిర్యాదు మేరకు సదరు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
–గతేడాది జూన్‌ 27న కలిగిరి ఏపీజీబీ బ్యాంకులో మరో 9 నకిలీ పాసుపుస్తకాలను గుర్తించి ఎటువంటి కేసులు నమోదు చేయలేదు.  జూలై 6న జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలించి నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్‌ తయారీదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ నకిలీలు చలామణి అవుతున్నాయి. 
–ఈ ఏడాది జూలై 12న కంప్యూటర్‌ ఆపరేటర్, మీసేవ నిర్వాహకుని సహకారంతో నకిలీ 1బీ, అడంగల్‌ తయారు చేసి కొందరు బ్యాంకులో రుణాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారని తెల్లపాడు గ్రామస్తులు తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన తహసీల్దార్‌ కంప్యూటర్‌ ఆపరేటర్, మీసేవ నిర్వాహకుడు, మరికొందరిపై కేసు నమోదు చేయించారు.
– తాజాగా ఈ నెల 8న మార్తులవారిపాళేనికి చెందిన మూలి పెంచలయ్య రెవెన్యూ అధికారుల సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేయడం వెలుగులోకి వచ్చింది. దీనిపై తహసీల్దార్‌ పోలిసులకు ఫిర్యాదు చేశారు. 
 
సూత్రదారులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం 
మండలంలో యథేచ్ఛగా నకిలీ పాసుపుస్తకాలను తయారు చేస్తున్నా సూత్రధారులను పట్టుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నకిలీల తయారీదారులు మీసేవ కేంద్రాల నుంచి ఖాళీ సర్టిఫికెట్లను కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారుల స్టాంపులు, సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సష్టిస్తున్నారు. బ్యాంకు రుణాలను పొందవచ్చనే ఆశను చూపుతూ అమాయకులైన రైతులకు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ పత్రాలు బయటపడి కేసులు నమోదు చేస్తే నకిలీదారులు తప్పించుకుంటున్నారు. రైతులు మాత్రం బలవుతున్నారు. నకిలీలకు కొందరు అధికారులు, నాయకులు సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నారు. పోలీసులు సైతం నకిలీ పత్రాల తయారీదారులను పట్టుకోవడంలో చొరవచూపడం లేదు. కేసును సీఐడీకి బదిలీ చేశామని చెబుతూ తప్పించుకుంటున్నారు. నకిలీ పత్రాల తయారీదారులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం లేదని తహసీల్దారే ఆవేదన వ్యక్తం చేస్తుండడం చూస్తే వారికి ఉన్న అండదండలు ఏ పాటివో అర్ధమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement