నకిలీ పాసుపుస్తకాలు, పహనీలు! | Sakshi
Sakshi News home page

నకిలీ పాసుపుస్తకాలు, పహనీలు!

Published Fri, Sep 23 2016 11:17 PM

నకిలీ పాసుపుస్తకాలు, పహనీలు!

  • పంట రుణం పొండం కోసం..
  • నిర్మల్‌లో యథేచ్ఛగా తయారీ
  • ఖానాపూర్‌లో వెలుగు చూసిన ఘటన
  • ఆర్డీవో, తహసీల్దార్‌ సంతకాల ఫోర్జరీ
  • పుస్తకాల్లో తేడాలు గుర్తించిన ఎస్‌బీఐ..
  • ఖానాపూర్‌ : ఇటీవల ఐటీడీఏ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన మరువకముందే.. నూతన జిల్లాగా ఏర్పడబోయే నిర్మల్‌ కేంద్రంగా నకిలీ పహనీలు, పట్టా పాసు పుస్తకాల తయారీ దందా ఉదంతం తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నకిలీ పాసుబుక్‌ తయారు చేసి బ్యాంకు అదికారులను బురిడి కొట్టించేలా ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బుక్కులోని చిన్న చిన్న లోపాలతో అధికారులకు పట్టుబడేలా చేశాయి. నిర్మల్‌ కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.
    ఇదీ సంగతి..
    ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మోసాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ, ఆర్థిక సహకారం అందాలని ప్రభుత్వాలు అన్ని పనులకు సైతం దాదాపు ఆన్‌లైన్‌ పద్ధతిని ప్రవేశపెడుతున్నాయి. కానీ ఖానాపూర్‌ మండలంలోని వెంకంపోచంపాడ్‌ గ్రామానికి చెందిన కొందరు నిర్మల్‌ కేంద్రంలో ఓ మీసేవ యజమాని సహకారంతో ఏకంగా ఆన్‌లైన్‌లో నకిలీ పహనీ పత్రాలు, పట్టా పాసు పుస్తకాలు తయారు చేస్తున్నారు. భూములు లేకున్నా పుస్తకంలో భూములు ఉన్నట్లు సర్వే నంబర్లు రాసి చూపి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాన్ని సష్టించి వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు, ఇతర రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓSవ్యక్తి శుక్రవారం నకిలీ పాసు పుస్తకాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ పాస్‌బుక్‌ బాగోతం గురించి తహసీల్దార్‌ ఆరె నరేందర్, ఎస్‌బీఐ బ్యాంక్‌ మేనేజర్‌ కె.రాఘవేంద్రన్‌ వెల్లడించారు.
    వెలుగు చూసిందిలా..
    వెంకంపొచంపాడ్‌ గ్రామానికి చెందిన పవార్‌ ఆనంద్‌ అనే వ్యక్తి అతడి భార్య అనిత పేరుతో మూడు ఎకరాల నాలుగు గుంటల భూమి సర్వే నంబర్‌ 341/1/1లో ఉన్నట్లు 226 పట్టా నంబర్‌తో నకిలీ పాసు పుస్తకాన్ని తయారు చే యించాడు. ఆ పుస్తకంలో నిర్మల్‌ ఆర్డీవో సంతకంతో పాటుగా తహసీల్దార్, వీఆర్వో సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశాడు. అలాగే నిర్మల్‌కు చెందిన ఓ మీసేవ యజమాని సహకారంతో ఆన్‌లైన్‌లో నకిలీ పహనీ సర్టిఫికెట్లు కూడా సష్టించగలిగాడు. దొంగ పాసుపుస్తకాలు కూడా నిర్మల్‌లోనే కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలిసిందని తహసీల్దార్‌ నరేందర్‌ తెలిపారు. అయితే ఈ డూప్లికేట్‌ పాసు పుస్తకాన్ని ఖానాపూర్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అందజేసి పసుపు పంటకు రుణం ఇవ్వాలని ఆనంద్‌ కోరాడు. బ్యాంకు అధికారులు ఆ పాసు పుస్తకాన్ని పరిశీలించి చూడగా దానిపై యూనిక్‌ ఐడీ లేకపోవడంతో అనుమానం వచ్చి రెవెన్యు కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవార్‌ అనిత భర్త ఆనంద్‌ పేరిట వెంకంపోచంపాడ్‌ గ్రామ పరిధిలో 226 పట్టా నంబర్‌తో సర్వే 341/1/1లో, 3.04 ఎకరాల భూమి ఎక్కడా లేదని తహసీల్దార్‌ నిర్ధారించారు. నకిలీ పాసుపుస్తకాలను తయారు చేసి బ్యాంకులను ఆయా శాఖల అధికారులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రహించారు.
    పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
    ఇలా డూప్లికేట్‌ పాసు పుస్తకాలు తయారు చేసిన వ్యక్తిపై గ్రామ పరిధి గల పెంబి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్‌ నరేందర్‌ తెలిపారు. ఈ దందాలో ఉన్న నిందితులందరిపైనా సమగ్ర విచారణ చేపిస్తామని పేర్కొన్నారు. ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement